రుణాలకు గిరాకీ లేదు

Mon,August 19, 2019 03:24 AM

-ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపనలు అవసరం
-ఎస్బీఐ చైర్మన్ రజ్నీశ్ కుమార్

కోల్‌కతా, ఆగస్టు 18: మార్కెట్‌లో క్రెడిట్ డిమాండ్ ఇంకా అంతంతమాత్రంగానే ఉన్నదని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ చైర్మన్ రజ్నీశ్ కుమార్ తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపనల అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆదివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ.. రుణాలపై బ్యాంకుల వడ్డీరేట్లూ తగ్గాయని గుర్తుచేశారు. బ్యాంకుల నుంచి రుణాల విషయంలో ఎలాంటి ఆటంకాలూ లేవని, రుణ లభ్యత పుష్కలంగానే ఉన్నా.. డిమాండ్ కరువైందని చెప్పారు. రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకొస్తున్నా.. తీసుకునేవారే లేరన్న ఆయన ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపనల అవసరం ఉందన్నారు. కాగా, దేశవ్యాప్తంగా వర్షాలు సమృద్ధిగా కురిస్తే రుణాల మంజూరు ఊపందుకోవచ్చన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాబోయే పండుగ సీజన్‌లోనూ రుణాలకు డిమాండ్ పెరిగే వీలుందన్నారు.

ఈసారి 12-14 శాతం వృద్ధి

ఈ ఆర్థిక సంవత్సరం (2019-20)లో రుణ వృద్ధిరేటు 12 నుంచి 14 శాతంగా నమోదు కావచ్చని ఈ సందర్భంగా కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు. గత ఆర్థిక సంవత్సరం (2018-19) 14 శాతంగా ఉందన్నారు. కోల్‌కతా రీజియన్‌లో ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్లతో సమావేశం కావడానికి కుమార్ ఇక్కడకు వచ్చారు. ఎస్బీఐ లోన్ పోర్ట్‌ఫోలియో దాదాపు రూ.23 లక్షల కోట్లుగా ఉన్నది. వచ్చే ఐదేండ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను 5 లక్షల కోట్ల డాలర్లకు తీసుకెళ్లాలన్న కేంద్ర ప్రభుత్వ ఆశయ సాధనలో భాగంగా బ్యాంకింగ్ రంగ పనితీరును సమీక్షించుకుని, మెరుగు పర్చుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది. దీంతో అన్ని బ్యాంకులు శాఖాధిపతుల సమావేశాలను నిర్వహిస్తున్నాయి.

ఆటో రంగానికి చేయూత

ఒత్తిడిలో ఉన్న ఆటో రంగాన్ని ఆదుకోవడంలో భాగంగా ఆటోమొబైల్ డీలర్ల రుణ వ్యవధిని పొడిగించినట్లు ఎస్బీఐ ఎండీ (రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్) ఆదివారం ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతూ తెలిపారు. సాధారణంగా క్రెడిట్ పీరియడ్ 60 రోజులు ఉంటుందని, దీన్ని 75 రోజులకు పెంచామన్న ఆయన కొన్ని కేసుల్లో 90 రోజుల వెసులుబాటును కల్పించామని పేర్కొన్నారు.

606
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles