అమర జవాన్ల కోసం మేముసైతం..

Tue,February 19, 2019 12:07 AM

ఎస్‌బీఐ రుణాల రద్దు
ముంబై, ఫిబ్రవరి 18: ఉగ్రవాదుల దుశ్చర్యకు బలైపోయిన జవాన్లపట్ల దేశం యావత్తూ కృతజ్ఞతాభావాన్ని తెలియజేస్తున్నది. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ కూడా తమకు వీలైన రీతిలో అమరవీరులకు సాయం చేసింది. జమ్ము-కశ్మీర్‌లోని పుల్వా మా జిల్లాలో గత వారం చోటుచేసుకున్న ఉగ్రదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వారిలో ఎస్‌బీఐ నుంచి రుణాలు పొందిన 23 మంది ఉన్నారు. దీంతో వీరందరి రుణ బకాయిలను రద్దు చేస్తున్నట్లు ఓ ప్రకటనలో ఎస్‌బీఐ స్పష్టం చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. కాగా, డిఫెన్స్ సాలరీ ప్యాకేజీ కింద ఈ జవాన్లందరూ ఎస్‌బీఐ ఖాతాదారులవగా, ఒక్కొక్కరికి రూ.30 లక్షల బీమాను బ్యాంక్ కల్పించింది. దీంతో ఈ బీమా సొమ్ము కూడా బాధిత కుటుంబాలకు త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్‌బీఐ తెలియజేసింది. అనుక్షణం దేశం కోసం పోరాడే సైనికులు.. ఇలా ఉగ్రవాదుల అరాచకానికి బలైపోవడం బాధాకరం. వీరి ప్రాణత్యాగం వృథాకాదు. దేశ భద్రతకు అహర్నిశలు పాటుపడుతూ అమరులైన ఈ జవాన్ల కుటుంబాలకు బ్యాంక్ తరఫున ఓ చిరు సాయం చేస్తు న్నాం అని ఎస్‌బీఐ చైర్మన్ రజ్నీశ్ కుమార్ సదరు ప్రకటనలో పేర్కొన్నారు. ఇదిలావుంటే వీర జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తున్న వారి కోసం ఓ యూపీఐని కూడా ఎస్‌బీఐ సృష్టించింది. తద్వారా విరాళాలు సులభంగా బాధితులకు చేరేలా ఏర్పాట్లు చేసింది.


కోల్ ఇండియా విరాళం

ఉగ్రదాడిలో అసువులుబాసిన జార్ఖండ్ సీఆర్‌పీఎఫ్ జవాన్ విజయ్ సోరెంగ్ కుటుంబానికి కోల్ ఇండియా అండగా నిలిచింది. కోల్ ఇండియా అనుబంధ సంస్థలైన, జార్ఖండ్‌లో ఉన్న సీసీఎల్, బీసీసీఎల్ సోమవారం దాదాపు రూ.1.75 కోట్ల విరాళాన్ని ప్రకటించాయి. సీసీఎల్‌లో 39,581 మంది, బీసీసీఎల్‌లో 46,344 మంది ఉద్యోగులున్నారు. వీరందరూ రూ.200 చొప్పున తమ వేతనంలో నుంచి సోరెంగ్ కుటుంబానికి సాయంగా ప్రకటించారు.

క్రెడాయ్ 2బీహెచ్‌కే ఇండ్లు..


ఉగ్రదాడిలో మరణించిన సైనిక కుటుంబాలకు మేమున్నామంటూ రియల్ ఎస్టేట్ డెవలపర్ల అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) ముందుకొచ్చింది. మరణించిన 40 మంది జవాన్ల కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు పడకల గదుల ఇండ్లను ఉచితంగా అందచేయనున్నట్లు ప్రకటించింది. వారు కోరుకున్న ప్రాంతం లేదా వారు ఉంటున్న రాష్ట్రంలో ఎక్కడైనా ఈ 2బీహెచ్‌కే ఇండ్లను ఇవ్వనున్నట్లు క్రెడాయ్ అధ్యక్షుడు జక్సే షా ఒక ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా 12,500 మంది సభ్యులు కలిగిన ఈ అసోసియేషన్ తరఫున వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

967
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles