రూ.18 వేల కోట్లిచ్చి పో..!

Wed,July 10, 2019 04:05 AM

Court seeks govt response on Jet Airways founder Naresh Goyal against LOC

విదేశాలకు అనుమతిపై జెట్ వ్యవస్థాపకుడు గోయల్‌తో ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ, జూలై 9: నరేశ్ గోయల్‌కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. విదేశాలకు వెళ్లాలనుకుంటే ముందు రూ.18,000 కోట్లను పూచీకత్తుగా డిపాజిట్ చేయాలని సూచించింది. ఆపై నిరభ్యంతరంగా ఏ దేశానికైనా వెళ్లిరావచ్చని స్పష్టం చేసింది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి విమానయాన సేవలకు దూరమైన దేశీయ ప్రైవేట్రం విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడే నరేశ్ గోయల్ అన్న విషయం తెలిసిందే. అప్పటిదాకా దేశం విడిచి వెళ్లరాదని తేల్చిచెప్పారు.

జెట్ ఎయిర్‌వేస్ కేసును తీవ్ర నేరాల దర్యాప్తు కార్యాలయం (ఎస్‌ఎఫ్‌ఐవో) విచారిస్తున్నదని, రూ.18,000 కోట్ల రుణ బకాయిలు దీనికి ముడిపడి ఉందని కోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ఈ క్రమంలోనే న్యాయమూర్తి సురేశ్ పైవిధంగా స్పందించారు. బ్యాంక్ గ్యారెంటీగా రూ.18,000 కోట్లను డిపాజిట్ చేసేందుకు మీరు సిద్ధంగా ఉంటే.. విదేశాలకు వెళ్లొచ్చు అని న్యాయమూర్తి అన్నారు. అప్పటిదాకా ఇంకెలాంటి ఆదేశాలను ఇవ్వలేమని చెప్పారు. తదుపరి విచారణను ఆగస్టు 23కు వాయిదా వేశారు.

ఎల్‌వోసీ విచారణపై..

తనపై జారీ చేసిన లుకౌట్ నోటీసుల (ఎల్‌వోసీ)ను సవాల్ చేస్తూ గోయల్ వేసిన పిటీషన్‌ను హైకోర్టు విచారిస్తున్నది. ఇందులో భాగంగానే కేంద్రం వివరణను కోరింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలంటూ హోం శాఖ, కార్పొరేట్ వ్యవహారాల శాఖ, న్యాయ శాఖలను ఆదేశించింది. మే 25న దుబాయ్‌కి వెళ్లే విమానం నుంచి గోయల్, ఆయన భార్య అనితా గోయల్‌ను అధికారులు దింపి వేసిన సంగతి విదితమే. వీరి వెంట తీసుకెళ్తున్న నాలుగు భారీ సూట్‌కేసులనూ స్వాధీనం చేసుకున్నారు.

అయితే కారణం ఏమిటా? అని ఆరా తీసిన గోయల్‌కు ఎల్‌వోసీ సంగతి తెలియడంతో దీనిపై హైకోర్టును ఆశ్రయించారు. గోయల్‌పై ఎలాంటి ఈసీఐఆర్/ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదు. గోయల్ దంపతులు విదేశాలకు పారిపోతున్నారని సూచించేలా ఎలాంటి అనుమానిత పరిస్థితులు లేకున్నా.. ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారని, వారు ప్రవాస భారతీయులు.. కొంతకాలం విదేశాల్లో ఉండాల్సిన అవసరం ఉందని గోయిల్ తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్ కోర్టుకు చెప్పారు.

2551
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles