కార్పొరేట్లకు భారీ ఊరట!

Tue,August 20, 2019 02:27 AM

Corporate tax to be cut gradually says Nirmala Sitharaman

-రూ.400 కోట్లకు పైగా టర్నోవర్ కలిగిన సంస్థలపై పన్ను 25 శాతానికిదశలవారిగా తగ్గిస్తాం..
-కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ, ఆగస్టు 19:ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్‌లో సంపన్న వర్గాలపై పన్ను వాత పెట్టిన కేంద్ర ప్రభుత్వం..తాజాగా కార్పొరేట్లను మచ్చిక చేసుకోవడానికి దశలవారీగా కార్పొరేట్ ట్యాక్స్‌ను 25 శాతానికి తగ్గించనున్నట్లు ప్రకటించింది. సంపద సృష్టికర్తలకు మద్దతుగా రూ.400 కోట్లకు పైగా వార్షిక టర్నోవర్ కలిగిన కార్పొరేట్ సంస్థలపై విధిస్తున్న పన్నును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించాలనుకుంటున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రకటించారు. గత బడ్జెట్‌లో రూ.400 కోట్ల లోపు టర్నోవర్ కలిగిన సంస్థలపై పన్నును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గిస్తు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంతక్రితం ఏడాది ఆర్థిక మంత్రి హోదాలో అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ.250 కోట్ల లోపు టర్నోవర్ కలిగిన సంస్థలపై విధిస్తున్న కార్పొరేట్ ట్యాక్స్ ను 25 శాతానికి తగ్గించారు. తాజాగా ఢిల్లీలో పారిశ్రామిక వర్గాలు ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. సంపద సృష్టికర్తలకు కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడు చేదోడువాదోడుగా ఉంటుందని, దీంట్లోభాగంగా దశలవారీగా కార్పొరేట్ ట్యాక్స్ ను తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఎప్పటిలోగా తగ్గించేదానిపై ఆమె స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. సంపద సృష్టికర్తలకు అన్ని రకాలు గా సహాయ సహకారాలు అందిస్తామని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన నాలుగు రోజుల్లోనే నిర్మలా ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.

ఆర్థిక మంత్రికి ప్రత్యక్ష ట్యాక్స్ కోడ్ నివేదిక

ఆదాయ పన్ను చట్టానికి ప్రత్యామ్నాయంగా రూపొందించిన నూతన ప్రత్యక్ష పన్నుల కోడ్ రూపొందించడానికి సీబీడీటీ సభ్యుడు అఖిలేష్ రంజన్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ సోమవారం తన పూర్తి స్థాయి నివేదికను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సమర్పించారు. ఈ విషయాన్ని నిర్మలా సీతారామన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ నివేదికలోని పూర్తి వివరాలు అంతత్వరగా వెల్లడయ్యే అవకాశాలు లేవు. మే 31నే తన నివేదికను సమర్పించాల్సి ఉండగా, మరో రెండు నెలలపాటు పొడిగించారు. సీబీడీటీ సభ్యుడు అఖిలేష్ రంజన్ నేతృత్వంలోని ఏర్పాటైన ఈ టాస్క్‌ఫోర్స్ కమిటీలో గిరిష్ అహుజా(ప్రముఖ సీఏ), రాజీవ్ మీమాని(ఈవై చైర్మన్, రీజినల్ మేనేజింగ్ పార్టనర్), ముకేశ్ పాటిల్(ట్యాక్స్ అడ్వకేట్), మన్సి కేడియా(ఐసీఆర్‌ఐఈఆర్ కన్సల్టెన్స్), జీసీ శ్రీవాత్సవ(రిటైర్డ్ ఐఆర్‌ఎస్ అధికారి) ఉన్నారు.

491
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles