ఆర్థిక వ్యవస్థ పై అవిశ్వాసం

Tue,February 12, 2019 02:05 AM

-సంక్షోభంలో ఎన్‌బీఎఫ్‌సీలు
-బ్యాంకింగ్ రంగంపై అపనమ్మకం
-కీలక రంగాలు డీలా
-నత్తనడకన మౌలిక రంగాలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులకుతోడు దేశీయంగా వీస్తున్న వ్యతిరేక పవనాలు భారతీయ ఆర్థిక వ్యవస్థను ప్రమాదంలో పడేస్తున్నాయి. దే శ ఆర్థిక వ్యవస్థపై అవిశ్వాసం మబ్బులు కమ్ముకుంటున్నాయి మరి. పేద, ధనిక అన్న తారతమ్యం లేకుండా ప్రతీ ఒక్కరినీ ఈ విపత్కర పరిణామాలు ప్రభావితం చేస్తుండటం ఇప్పుడు ఆందోళన చెందే అంశం. అసలే మొండి బకాయిల (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పీఏ) సమస్యతో సతమతమవుతున్న బ్యాంకింగ్ రంగం తో దిగాలుపడిన భారతీయ ఆర్థిక వ్యవస్థను బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీ) సంక్షోభం.. పెనం మీద నుంచి పొయ్యిలోపడ్డ చందంగా మారుస్తున్నది. దీంతో కేంద్ర ప్రభుత్వం సైతం అయోమయంలో పడుతున్నది. కీలక రంగాలు డీలా పడుతుండటంతో దేశ జీడీపీపై ఆ ప్రభావం కనిపిస్తుండటం.. ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్షాలకు ఓ ఆయుధం దొరికినట్లేనన్న భావన మోదీ సర్కారులో వ్యక్తమవుతున్నది.

దడ పుట్టిస్తున్న ఎన్‌బీఎఫ్‌సీలు


బ్యాంకింగ్ రంగం ఒత్తిడిలో ఉన్న వేళ.. నాన్ బ్యాంకింగేతర సంస్థల సంక్షోభం దేశ ఆర్థిక వ్యవస్థకు దడ పుట్టిస్తున్నది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభంతో భారతీయ ఎన్‌బీఎఫ్‌సీల రంగం డీలా పడిపోయింది. చెల్లింపుల్లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంస్థలు వరుసగా డిఫాల్ట్ అవుతుండటంతో కీలక రంగాలకు ఇప్పటిదాకా అందిన కాస్తోకూస్తో ఆర్థిక సాయం కూడా దూరమైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ (పీసీఏ) నిబంధనలతో బ్యాంకింగ్ రంగం నుంచి వ్యాపార, పారిశ్రామిక రంగాలకు నిధుల విడుదల తగ్గిపోవడంతో చాలావరకు సంస్థలు ఎన్‌బీఎఫ్‌సీల రుణాలపైనే ఆధారపడ్డాయి. కానీ ఈ సంస్థలు కూడా సంక్షోభంలో చిక్కుకోవడంతో ప్రధాన రంగాలు నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయిప్పుడు. దీవాన్ హౌజింగ్ ఫైనాన్స్ కార్ప్ లిమిటెడ్ (డీహెచ్‌ఎఫ్‌ఎల్) కుంభకోణం కూడా భయం రేకెత్తించింది. ఈ పరిస్థితులు వృద్ధిరేటును ప్రభావితం చేస్తే.. రెండోసారి అధికారం ఆశలు ఆవిరైనట్లేనని బీజేపీ ప్రభుత్వం మదనపడిపోతున్నది.

మార్కెట్లకు అందని నిధులు


గతేడాది సెప్టెంబర్‌లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం బయటపడిన దగ్గర్నుంచి దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు మొదలయ్యాయి. అసలే నీరవ్ మోదీ మోసంతో రుణాల విషయంలో ఆత్మరక్షణలో పడిన బ్యాంకింగ్ రంగం.. రుణాల మంజూరును మరింత కట్టుదిట్టం చేయడంతో మార్కెట్లకు నిధులు కరువయ్యాయి. దీంతో 12.8 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.90,000 కోట్లు) ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ రుణ సంక్షోభం ప్రభావం.. స్టాక్ మార్కెట్లపైనా పడినైట్లెంది. రుణ సెక్యూరిటీలు, ఐపీవో, ఎఫ్‌పీవో తదితర మార్గాల ద్వారా నిధుల సమీకరణకు ప్రయత్నిస్తున్న సంస్థలకూ ప్రతిబంధకంగా మారింది. స్టాక్ మార్కెట్లలో నెలకొన్న ఈ విపత్కర పరిస్థితులు కూడా దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలంగా మారడం ఆర్థిక వ్యవస్థపై అపనమ్మకపు అభిప్రాయాలు చెలరేగాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

నీరసించిన మౌలిక ప్రాజెక్టులు


బ్యాంకింగ్, నాన్-బ్యాంకింగ్ ఆర్థిక రంగాల్లో నెలకొన్న ప్రతికూల వాతావరణంతో దేశ ఆర్థిక వ్యవస్థలో నిస్తేజం ఆవరించింది. ఇది అన్ని కీలక రంగాలను ప్రభావితం చేస్తుండగా, మౌలిక ప్రాజెక్టులనూ దెబ్బ తీస్తున్నది. చాలావరకు ప్రాజెక్టులు నిధుల కొరతను ఎదుర్కొంటుండగా, దాదాపు రూ.15 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు నిలిచాయని అంచనా.

ఎన్‌సీఎల్‌ఏటీ అనుమతి


రుణ సంక్షోభంలో ఉన్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ సంస్థల్లో 22 సంస్థలకు రుణాల చెల్లింపునకు నేషనల్ కంపెనీ లా అప్పీలెట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) సోమవారం అనుమతినిచ్చింది. మరోవైపు జస్టిస్ ఎస్‌జే ముఖోపాధ్యయ సారథ్యంలోని ఇద్దరు సభ్యుల ధర్మాసనం.. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంస్థల సంక్షోభం పరిష్కార తీర్మాన ప్రక్రియ సూచన కోసం సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ డీకే జైన్‌ను నియమించింది. కాగా, ఎన్‌సీఎల్‌ఏటీ మారటోరియంను కూడా ఎత్తివేయగా, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా బాగున్న సంస్థలను షెడ్యూల్ ప్రకారం రుణాల చెల్లింపునకు అనుమతించింది.

817
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles