పెద్దనోట్ల రద్దు దినం!

Fri,November 9, 2018 02:55 AM

completes two Years Of Demonetisation

-తానొకటి తలిస్తే..!
-లక్ష్యం చేరని గురి..
-డివిడెండ్: ఓ అందని ద్రాక్ష..
-నేటి పరిణామాలకు నాడే బీజం?
నేటి రిజర్వ్ బ్యాంక్ విభేదాలకు బీజం పడి గురువారాని కి రెండేండ్లు. పెద్ద నోట్ల రద్దుతో భారీ గా డివిడెండ్ పొందాలన్న అసలు లక్ష్యపు ఆనవాళ్లు నేడు బయటపడుతున్నాయి. యూపీ పీఠం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆత్రంగా అమలుచేసిన నిర్ణయం చేదు అనుభవాలనే మిగిల్చింది. ప్రజాకర్షక రాజకీయాలకు పైసలు కావాలి. అందుకు అక్షయ పాత్ర లాంటి రిజర్వ్ బ్యాంక్ కనిపించింది. పెద్ద నోట్లను రద్దు చేస్తే కనీసం 3.5 లక్షల కోట్లు డివిడెండ్ రూపేణా పొందవచ్చుననుకున్నారు. అది నెరవేరకపోగా, వచ్చే డివిడెండ్‌లో సగానికి కోత పడింది. ఇప్పుడదే డివిడెండ్ మీద కన్నుతో ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిపై కత్తి వేలాడుతున్నది. సాధారణ ఎన్నికల ముందు ప్రజాకర్షక పథక రచనే లక్ష్యంగా నేడు ఆర్బీఐ మీద సెక్షన్ 7 ప్రయోగానికి సిద్ధపడుతున్నది.

పెద్ద నోట్ల రద్దుకు రెండేండ్లు. చలామణిలో ఉన్న 86 శాతం కరెన్సీని రాత్రికిరాత్రి రద్దు చేసిన ప్రభుత్వం లక్ష్యం నెరవేరిందా? వందల మంది ప్రాణాలను బలిగొన్న ఈ ప్రహసనాన్ని ప్రభుత్వ పెద్దలు తప్ప సామాన్యుని దగ్గర నుంచి ప్రపంచంలోని ఏ ఆర్థికవేత్తా హర్షించలేదు. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంకుకు, కేంద్ర ప్రభుత్వానికి జరుగుతున్న విభేదాలకు మూలం డీమానిటైజేషన్ ప్రక్రియలోనే బీజాలు పడ్డట్టు అనేక పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. నల్లధనం నిర్మూలన, నకిలీ నోట్ల కట్టడి, తీవ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్ట... ఇవీ పాత పెద్ద నోట్ల రద్దును ప్రకటిస్తున్నప్పుడు ప్రధాని చెప్పిన లక్ష్యాలు. 99 శాతంపైగా నోట్లు తిరిగిరావడంతో మొదటిది బ్లాక్‌మనీ లేదని తేలినట్టేనా?.. ఇక కొత్త నోట్లను తీసుకువచ్చిన నెలలోపే రూ.2,000 నోట్లు నకిలీవి చలామణిలోకి వచ్చినట్టు వార్తలొచ్చాయి. డీమానిటైజేషన్ ప్రకటించిన నవంబర్ నెలలోనే కనీసం మూడు తీవ్రవాద దాడులు జరిగాయి. ఈ క్రమంలో పై మూడు లక్ష్యాలపై మాట మార్చిన ప్రభుత్వం.. పన్నుల వసూళ్లు పెరుగుతాయనీ, నగదు రహిత ఆర్థిక వ్యవస్థ అనే కొత్త లక్ష్యాలను తెరపైకి తెచ్చింది. కాలక్రమేణా అవీ నీటి మీద రాతలే అని తేలింది.

అసలు ఉద్దేశ్యం..

పెద్ద నోట్లను రద్దు చేస్తే కనీసం 30 శాతం నోట్లు వెనక్కి రావని ప్రభుత్వం భావించింది. అందువల్ల ప్రభుత్వానికి రూ.3.5 నుంచి రూ.4 లక్షల కోట్లు డివిడెండ్ రూపేణా అదనంగా వస్తాయని అనుకున్నది. కానీ... అది నెరవేరలేదు. ఆశ్యర్యకరంగా ప్రభుత్వం ప్రస్తుతం రూ.3.5 లక్షల కోట్ల డివిడెండ్ ఆశిస్తున్న తీరును చూస్తుంటే రిజర్వ్ బ్యాంక్‌తో విభేదాలకు బీజం ఎక్కడిదో అవగతం అవుతుంది. ఈ అదనపు డివిడెండ్‌తో ప్రభుత్వ ఖజానా నిండి ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన పేరుతోపాటు ప్రజాకర్షక పథకాలకు శ్రీకారం చుట్టడానికి మరింత వెసులుబాటు లభిస్తుందని మోదీ సర్కార్ భావించింది. కానీ... అందుకు ఫలితం భిన్నంగా ఉంది. 99.3 శాతం పెద్ద నోట్లు డిపాజిట్ అయ్యాయి. కనీసం పది వేల కోట్లూ వెనక్కి రాలేదు. తత్ఫలితంగా 70 ఏండ్ల తర్వాత తొలిసారిగా ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంకు నుంచి వచ్చే డివిడెండ్ సగానికి తగ్గింది. 2015-16 సంవత్సరానికి రూ.65,876 కోట్ల డివిడెండ్‌ను పొందిన ప్రభుత్వం.. డీమానిటైషన్ ప్రభావంతో 2016-17 ఆర్థిక సంవత్సరానికి రూ.30,659 కోట్ల డివిడెండును మాత్రమే అందుకోగలిగింది. తాను తలిచింది ఒకటి జరిగింది మరొకటి.

notes

అదనంగా భారమే..

కొత్తగా ప్రవేశపెట్టిన రూ.2,000, రూ.500 నోట్లను ద్రవ్య వ్యవస్థలోకి తీసుకురావడానికి రెండు నెలలు పట్టింది. ఏటీఎంలను రీకాలిబ్రేట్ (కొత్త కరెన్సీకి తగ్గట్లుగా మార్చడం) చేయకుండా వాటిని ప్రవేశపెట్టడంతో మరింత గందరగోళం. కేవలం 60 రోజుల్లో వ్యవస్థలోని నోట్లన్నీ వచ్చి పడడంతో ఆశ్చర్యపోయిన ప్రభుత్వం.. వాటిని పదే పదే లెక్కించాలంటూ రిజర్వ్ బ్యాంక్‌ను ఆదేశించడంతో 21 నెలల దాటిన తర్వాతగానీ వాస్తవాన్ని జీర్ణించుకోలేపోయింది. ఏటీఎం రీకాలిబ్రేషన్‌కు వ్యయంతోపాటు కొత్త నోట్లను ముద్రించడానికి అదనంగా రూ.8,000 కోట్లకుపైగా వెచ్చించాల్సి వచ్చింది. ఇటీవలే కొత్తగా ప్రవేశపెట్టిన రూ.200, రూ.100 నోట్ల రీకాలిబ్రేషన్ ఇంతవరకూ కాలేదు. దేశంలో ఉన్న 2.4 లక్షల ఏటీఎంలను రీకాలిబ్రేట్ చేయడానికి కనీసం రూ.100 కోట్ల ఖర్చు చేయాల్సి రావడంతో బ్యాంకులు వెనుకంజ వేస్తున్నాయి. కొత్త, పాత వంద నోట్లను ఒకే ఏటీఏం నుంచి తీసుకు రావడం అంటే అది సవాలే... కొత్త రూ.200 నోట్లు వచ్చి దాదాపు ఆరు నెలలు గడుస్తున్నా వాటిని ఏటీఎంల నుంచి తీసుకునే భాగ్యం లేదు.

చరిత్ర చెప్పిన పాఠం

తొలి డీమానిటైజేషన్ 1946లోనే జరిగింది. రూ.1,000, రూ.5,000, రూ.10,000 నోట్లను రద్దు చేస్తూ బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సామన్యులపై ప్రభావం చూపలేదు. బ్లాక్‌మనీని అరికట్టాలంటే పెద్ద నోట్లను రద్దు చేయాలని 1970లో వాంఛూ కమిటీ సిఫార్సు చేసింది. ఈ సిఫార్సును అమలు చేసే లోపే పెద్ద నోట్లన్నీ బ్యాంకుల్లోకి చేరడంతో ఆ సిఫార్సు ఓ ఫార్సుగానే మిగిలిపోయింది. ఆ తర్వాత 1977లో జనతా ప్రభుత్వం అమలులోకి వచ్చిన తర్వాత ప్రధాని మొరార్జి దేశాయ్ కూడా పెద్ద నోట్ల రద్దును బ్లాక్‌మనీ, నకిలీ నోట్లే లక్ష్యంగా చేశారు. అప్పుడు చలామణిలో ఉన్న పెద్ద నోట్లు నిజానికి ఇప్పుడున్న దాంట్లో కేవలం మూడో వంతు మాత్రమే. దాంతో దాని ప్రభావం పెద్దగా పడలేదు. అప్పటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఐజీ పటేల్ ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పటికి, ఇప్పటికి తేడా తాను కోరి తెచ్చుకున్న ఊర్జిత్ పటేల్. ప్రధాని మోదీ ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు సాహసోపేత నిర్ణయంగా అభివర్ణించారు. కానీ కాలక్రమేణా రాజకీయ ఎజెండాలు ప్రస్తుతం పటేల్‌కు పక్కలో బల్లెం మాదిరిగా మారాయి. నిజానికి యూరోను ప్రవేశపెట్టినప్పుడు యూరోపియన్ దేశాల కరెన్సీలు వెనక్కి రావడానికి పదేండ్లు పట్టింది.

రెండేండ్ల గరిష్ఠానికి నిరుద్యోగ రేటు

దేశంలో నిరుద్యోగం పడగవిప్పుతున్నది. గడిచిన నెలలో దేశవ్యాప్తంగా 39.70 కోట్ల మంది ఉద్యోగులు ఉన్నారు. అంతక్రితం ఏడాది ఇదే నెలలో ఉన్న 40.7 కోట్ల మందితో పోలిస్తే 2.4 శాతం తక్కువ. అంటే నిరుద్యోగ రేట్ రెండేండ్ల గరిష్ఠ స్థాయి 6.9 శాతానికి చేరుకున్నట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) వెల్లడించింది. దేశీయ జనాభాలో వీరి వాటా 39.5 శాతం. రెండేండ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తు తీసుకున్న నిర్ణయం ఉద్యోగ కల్పనపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపింది. ముఖ్యంగా అసంఘటిత రంగంలో ఉద్యోగ అవకాశాలు కరిగిపోయాయి. మొత్తం జనాభాలో 42.4 శాతం మంది భారతీయులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. వీరిలో కార్మికుల రేషియో కూడా తగ్గుముఖం పట్టింది. జనవరి 2016 తర్వాత ఒకే నెలలో ఇంతటి స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి. పెద్ద నోట్ల రద్దుకు ముందు కార్మికుల రేషియో 47-48 శాతంగా ఉండగా, ప్రస్తుతం ఇది 30 శాతం స్థాయికి పడిపోయింది. అత్యధిక స్థాయి నిరుద్యోగులు ఉద్యోగం కోసం వేచి చూస్తున్నారు.

నెరవేరిన రాజకీయ లక్ష్యం

రాజకీయ ఉద్దేశ్యాలు లేకుండా ఇంత పెద్ద నిర్ణయాలు ఏ ప్రభుత్వమూ తీసుకోదు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికలకు కొన్ని నెలల ముందుగానే పెద్ద నోట్లను రద్దు చేశారు. దీంతో ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను దెబ్బతీయగలిగారు. అలాగే, అవినీతిపై పోరాడుతున్న యోధుడిగా ఆ ఎన్నికల్లో ముద్ర వేయగలిగారు. అందుకే బీజేపీ ఉత్తర ప్రదేశ్‌లో అధికార పీఠాన్ని అత్యధిక మెజారిటీతో చేజిక్కించుకోగలిగింది. ఆ తర్వాత డీమానిటేజేషన్ ప్రస్తావనను తగ్గించేశారు. ఇటీవలి స్వాతంత్య్రదినోత్సవ ఉపన్యాసంలో డీమానిటైజేషన్‌ను గొప్ప చర్యగా కాదుకదా అసలు ప్రస్తావించనే లేదు. నిజానికి 60 శాతం మంది ప్రజలు బ్లాక్‌మనీ పెరిగిందనే అభిప్రాయపడుతున్నారు.

పెద్ద నోట్ల రద్దుకు రెండేండ్లు

ఫలం దక్కిందా?

బ్లాక్ మనీ

black-money
99.30 శాతం నోట్లు వెనక్కి రావడం వల్ల బ్లాక్‌మనీ లేదని తేలింది. చలామణిలో ఉన్న రూ.15.41 లక్షల కోట్లలో రూ.15.31 లక్షల కోట్లు వెనక్కి వచ్చాయి. మిగతా సొమ్ములో కొంత భాగం ఇప్పటికీ నేపాల్, భూటాన్ దేశాల్లోని బ్యాంకుల్లో ఉన్నట్టు సమాచారం. దీంతో నల్లధనం ఉన్నా దాన్ని వైట్‌గా చేసుకోవడానికి అవకాశంగా డీమానిటైజేషన్ ఉపయోగపడింది.

నకిలీ నోట్ల ఆటకట్టు

fake-currency
నకిలీ నోట్ల సంఖ్యను కూడా రిజర్వ్ బ్యాంక్ వార్షిక నివేదిక కఠోర వాస్తవాలనే వెల్లడించింది. 2016-17లో 7,62,072 నోట్లను నకిలీవిగా గుర్తిస్తే 2017-18లో దాదాపు 31.4 శాతం తక్కువగా 5,22,783 నోట్లను మాత్రమే గుర్తించారు. నకిలీ చేయలేరని గర్వంగా ప్రకటించిన రూ.2,000 నోట్లు 2017-18లో 17,929 నోట్లను పట్టుకున్నారు. అలాగే 9,892 రూ.500 నోట్లను నకిలీవని గుర్తించారు. సో ఈ లక్ష్యమూ నెరవేరనట్టే.

నగదు రహిత ఆర్థిక వ్యవస్థ

ATM-credit-card
పెద్ద నోట్ల రద్దు తర్వాత జరిగిన పరిణామాలతో నగదు రహిత ఆర్థిక వ్యవస్థ నినాదాన్ని తెరపైకి తెచ్చింది. మొదటి ఆరు నెలలు గత్యంతరం లేక ఆన్‌లైన్‌లో లావాదేవీలు జరిపిన జనం ఆ తర్వాత చార్జీల బాదుడు భరించ లేక నగదు లావాదేవీలకే మొగ్గు చూపుతున్నారు. డీమానిటైజేషన్‌కు ముందున్న స్థాయిలోనే ఇప్పటికీ ఆన్‌లైన్ లావాదేవీలు జరుగుతున్నాయన్నది వాస్తవం. రిజర్వ్ బ్యాంక్ నివేదిక అందుకు సాక్ష్యం. కొన్ని సంస్థల మేలుకే దాన్ని అమలు చేశారన్న ఆరోపణలూ ఉన్నాయి.

పన్ను వసూళ్లు

Tax-Collection
పన్ను చెల్లించకుండా తప్పించుకుంటున్న వారంతా పెద్ద నోట్ల రద్దుతో పన్ను పరిధిలోకి వస్తారనీ తద్వారా పన్ను వసూళ్లు పెరుగుతాయని భావించింది. కానీ, 2014 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 14.3 శాతం పెరిగితే, 2015 లో 8.9 శాతం, 2016లో 6.9 శాతం చొప్పున పెరిగాయి. అయితే డీమానిటైజేషన్ తర్వాత 2017లో 14.6 శాతం, 2018లో 17.1 శాతం చొప్పున పెరిగాయి. అయితే 14-17 శాతం పెరుగుదల దేశీయ ఆర్థిక వ్యవస్థలో పెద్ద విషయమేమీ కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రతి ఏటా పన్ను చెల్లింపులదారుల సంఖ్యలో కూడా అనూహ్య పెరుగుదలేమీ లేదన్నది వాస్తవం.

తీవ్రవాద కార్యకలాపాలు

terror
హవాలా సొమ్ము మీద ఆధారపడిన జమ్ము కశ్మీర్‌లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు, మావోయిస్టులు నోట్ల రద్దుతో నీరుగారిపోతారని ప్రభుత్వం భావించింది. డీమానిటైజేషన్ ప్రారంభంలో కాస్త తగ్గినా ఆ తర్వాత ప్రభావం అంతంత మాత్రమే. దేశం లో డీమానిటైజేషన్ కారణంగా తీవ్రవాద కార్యకలాపాలు తగ్గాయనడానికి ఎలాంటి లెక్కా పత్రం లేదు.

8503
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles