నిరుద్యోగులకు మంచి రోజులు

Fri,January 12, 2018 12:52 AM

Companies to increase headcount salary rise of 10 Percent likely

-కొత్త సిబ్బందిని నియమించుకునేందుకు 55 శాతం సంస్థల ఎదురుచూపు
-ఈ ఏడాది 10 శాతం పెరుగనున్న జీతాలు
Jobs
న్యూఢిల్లీ, జనవరి 11: ఉద్యోగార్థులకు శుభవార్త. నిరుద్యోగులకు త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని, దేశంలోని అనేక సంస్థలు ఈ ఏడాది తమ ఉద్యోగుల వేతనాలను 10 శాతం మేరకు పెంచడంతో పాటు పెద్ద సంఖ్యలో కొత్త ఉద్యోగులను చేర్చుకునే అవకాశం ఉందని మెర్సెర్స్-2017 ఇండియా టోటల్ రెమ్యునరేషన్ తన సర్వే నివేదికలో వెల్లడించింది. దేశంలోని 791 సంస్థలపై సర్వే నిర్వహించి ఈ నివేదిక రూపొందించామని, వీటిలో దాదాపు 55 శాతం సంస్థలు రానున్న 12 నెలల్లో కొత్త ఉద్యోగులను చేర్చుకోవాలన్న ఆలోచనలో ఉన్నాయని మెర్సెర్స్ స్పష్టం చేసింది. ఆర్థిక పరిస్థితులు ఆశావహంగా ఉన్నప్పటికీ నైపుణ్యత కలిగిన ఉద్యోగుల కొరత ఏర్పడటంతో దేశ పారిశ్రామిక వృద్ధి మందకొడిగానే కొనసాగే అవకాశం ఉందని, దీంతో ఈ ఏడాది కొత్త ఉద్యోగులను చేర్చుకోవాలని దేశంలోని ప్రతి రెండు సంస్థల్లో ఒకటి ఆలోచిస్తున్నదని మెర్సెర్స్ ఇండియా బిజినెస్ లీడర్ శాంతి నరేష్ తెలిపారు. రిటైల్, ఎఫ్‌ఎంసీజీ, తయారీ, ఫార్మా, సేల్స్, డిజైనింగ్, ఎనలిటిక్ తదితర రంగాల్లో ఉద్యోగులపై బాధ్యతలు పెరుగడంతో కొత్త సిబ్బందిని నియమించడం అనివార్యంగా కనిపిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ఇదిలావుంటే, క్లౌడ్, సెక్యూరిటీ, డేటా సైన్స్ తదితర రంగాల్లో నైపుణ్యమున్న వారికి ఈ ఏడాది ఎక్కువగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని ఐబీఎం ఇండియా మానవ వనరుల విభాగం వైస్‌ప్రెసిడెంట్ దిల్‌ప్రీత్ సింగ్ తెలిపారు.

1264
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS