బడ్జెట్‌కుముందు లాభాల స్వీకరణ

Thu,February 1, 2018 09:30 AM

Sensex
ముంబై, జనవరి 30: దేశీయ స్టాక్ మార్కెట్ల రికార్డుల ర్యాలీకి బ్రేక్‌పడింది. గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్‌కు ముందు మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో సూచీలు దిగువముఖం పట్టాయి. వీటితోపాటు ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు కూడా ఈ పతనానికి ఆజ్యంపోశాయి. ఉదయం 36,277.12 వద్ద ప్రారంభమైన సూచీ ఒక దశలో 35,993.41 కనిష్ఠ స్థాయిని తాకింది. చివరకు నిన్నటి ముగింపుతో పోలిస్తే 249.52 పాయింట్లు తగ్గి 36,033.73 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ 80.75 పతనం చెంది 11,049.65 వద్ద ముగిసింది. వడ్డీరేట్లపై నిర్ణయం తీసుకోవడానికి అమెరికా ఫెడరల్ రిజర్వు సమావేశం ప్రారంభమవడంతో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ఏషియన్ పెయంట్స్ అత్యధికంగా 2.22 శాతం పతనం చెంది టాప్ లూజర్‌గా నిలిచింది.


కొటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, అదానీపోర్ట్స్, రిలయన్స్, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, యెస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్‌లు ఒక శాతంకు పైగా మార్కెట్ వాటాను కోల్పోయాయి. వీటితోపాటు టాటా స్టీల్, టాటా మోటార్స్, మారుతి, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, బజాజ్-ఆటో, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎయిర్‌టెల్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మహీంద్రాలు నష్టపోయాయి. కానీ, కోల్ ఇండియా 1.71 శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది. హీరో మోటోకార్ప్, సన్‌ఫార్మా, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్, హెచ్‌యూఎల్‌లు లాభాల్లో ముగిశాయి. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల్లో నష్టం రూ.130 కోట్లకు తగ్గినట్లు రిలయన్స్ కమ్యూనికేషన్స్ ప్రకటించడంతో కంపెనీ షేరు ధర అమాంతం 10.46 శాతం లాభపడింది. రంగాల వారీగా చూస్తే కన్జ్యూమర్ డ్యూరబుల్ ఇండెక్స్ 1.74 శాతం క్షీణించగా, ఐటీ 1.07 శాతం, టెక్ 1.02 శాతం, బ్యాంకెక్స్, రియల్టీ, మెటల్, హెల్త్‌కేర్, మౌలిక, ఆటో, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్‌ఎంసీజీ రంగాలకు చెందిన షేర్లలో క్రయ విక్రయాలు భారీగా జరిగాయి.

624
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles