ఎగుమతుల వృద్ధి కోసం..!

Mon,July 22, 2019 03:13 AM

CII report identifies 31 items to boost India exports

-31 ఉత్పత్తులను సిఫార్సు చేసిన సీఐఐ..
-మహిళల దుస్తులు, ఔషధాలకు తొలి ప్రాధాన్యత

న్యూఢిల్లీ, జూలై 21: పడిపోయిన దేశీయ ఎగుమతులను తిరిగి నిలబెట్టేందుకు పారిశ్రామిక సంఘం సీఐఐ.. 31 ఉత్పత్తులను గుర్తించింది. గత నెల భారతీయ ఎగుమతులు గతేడాదితో పోల్చితే 9.71 శాతం క్షీణించి, ఎనిమిది నెలల కనిష్ఠాన్ని చేరిన విషయం తెలిసిందే. జూన్‌లో 25.01 బిలియన్ డాలర్లకే పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో మహిళల దుస్తులు, ఔషధాలు, సైక్లిక్ హైడ్రోకార్బన్లు తదితర 31 ఉత్పత్తుల ఎగుమతిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సీఐఐ అభిప్రాయపడింది. ఫర్నీచర్, టెలిఫోన్ సెట్లు, ఎలక్ట్రికల్ ఉపకరణాలు, మోటర్ కార్లు, వాహనాల ఎగుమతులు అంతర్జాతీయ మార్కెట్‌లో భారతీయ ఎగుమతులను మరింత పెంచగలవని ఆదివారం సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. అతిపెద్ద ఎగుమతిదారుగా దేశాన్ని నిలబెట్టగలవని తెలిపారు. భారతీయ ఎగుమతులు: తదుపరి పథం-ఉత్పత్తులు-దేశాలు అన్న రిసెర్చ్ పేపర్‌ను సీఐఐ విడుదల చేసింది. ఇందులో దేశీయ ఎగుమతుల విస్తరణ కోసం రెండంచెల వ్యూహాన్ని ప్రతిపాదించింది. భారతీయ ఎగుమతులకు పట్టున్న దేశాలే లక్ష్యంగా పలు సూచనలు, సలహాలు ఇచ్చింది.

పన్ను మినహాయింపులు కావాలి

పడకేసిన విదేశీ వాణిజ్యాన్ని పరుగులు పెట్టించాలంటే పన్నుల నుంచి మినహాయింపు అవసరమని ఈ సందర్భంగా చంద్రజిత్ బెనర్జీ స్పష్టం చేశారు. ఎంపిక చేసిన ఉత్పత్తులకు ఆకర్షణీయమైన మార్కెటింగ్‌ను కల్పించడానికి ఆయా దేశాలకు పన్నుల భారాన్ని తప్పించాలని అన్నారు. ఏయే ఉత్పత్తికి ఏయే దేశాల్లో డిమాండ్ ఉందో తెలుసుకుని ఆయా దేశాలకు ఎగుమతులు పెంచుకునే దిశగా అడుగులు వేయాలని సూచించారు. ఇందులో భాగంగానే సదరు దేశాల ప్రభుత్వాలతో చర్చించి భారతీయ ఎగుమతులపై దిగుమతి సుంకాలను ఎత్తివేసేలా చర్యలు చేపట్టాలన్నారు. దీనివల్ల ద్వైపాక్షిక వాణిజ్యం పెరుగుతుందన్న ఆయన ఇలాంటి ప్రోత్సాహకాలనే ఆ దేశాల ఉత్పత్తులకూ అందిస్తే గొప్ప వ్యాపారావకాశాలుంటాయని, నూతన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలకు తెరతీయాలని కోరారు.

విదేశాల్లో ప్రోత్సాహక కేంద్రాలు

స్వదేశీ బ్రాండ్‌ను ప్రోత్సహించడానికి విదేశాల్లో సెంటర్లను ఏర్పాటు చేయాలని, ఆయా భారతీయ ఉత్పత్తుల వినియోగానికి వీలుగా అక్కడి నుంచి ప్రచారం చేయాలని సలహా ఇచ్చారు. మార్కెట్‌లోని ప్రత్యర్థి బ్రాండ్లకు, స్థానిక బ్రాండ్లకు గట్టి పోటీనిచ్చేలా వ్యూహాలు సిద్ధం చేస్తే విదేశీ మార్కెట్‌లో భారతీయ ఉత్పత్తుల హవా కొనసాగుతుందన్నారు. ఇక దేశీయంగానూ తయారీ రంగానికి ఊతమివ్వాలని, పారిశ్రామిక వాడలను బలోపేతం చేయాలని, రోడ్డు, రైలు, పోర్టు తదితర మౌలిక సదుపాయాలను కల్పించాలని సూచించారు. మెరుగైన రవాణా సౌకర్యాలతోపాటు విద్యుత్, భూ కేటాయింపులు, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ప్రయోజనాలను కల్పిస్తే.. ఎగుమతులు మళ్లీ గాడిలో పడుతాయన్న విశ్వాసాన్ని చంద్రజిత్ బెనర్జీ వ్యక్తం చేశారు.

313
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles