సిగరెట్లపై సెస్సు పెంపు

Tue,July 18, 2017 12:37 AM

Cigarettes get costlier GST Council decides to increase cess over 28% tax

అర్ధరాత్రి నుంచే అమలులోకి..
ప్రభుత్వానికి రూ.5వేల కోట్ల అదనపు ఆదాయం

smoke
న్యూఢిల్లీ, జూలై 17: సిగరెట్లపై సెస్సును పెంచుతున్నట్లు జీఎస్టీ మండలి ప్రకటించింది. సోమవారం అర్ధరాత్రి నుంచే పెంపు అమలులోకి వచ్చింది. తద్వారా ప్రభుత్వానికి రూ.5 వేల కోట్ల మేర ఆదాయం సమకూరనుంది. జీఎస్టీ హయాంలో సిగరెట్లపై నిర్ణయించిన పన్ను, సుంకం, సెస్సు.. పాత విధానంలో వర్తింపజేసిన పన్ను భారం కంటే తగ్గడంతో సంస్థలు ఏడాదిలో రూ.ఐదు వేల కోట్ల మేర లాభపడి ఉండేవని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమీక్ష అనంతరం మీడియాతో అన్నారు. అందుకే స్థిర సెస్సును పెంచినట్లు తెలిపారు. 65 మిల్లీ మీటర్ల వరకు పొడవు ఉండే 1000 సిగరెట్లపై సెస్సును మరో రూ.485 పెంచారు. అలాగే, 65 నుంచి 70 మిల్లీ మీటర్ల పొడవుండే 1000 సిగరెట్లపై సెస్సు రూ.792 పెరిగింది. ఈ నిర్ణయం కారణంగా బహిరంగ మార్కెట్లో సిగరెట్ల ధరలు పెరిగే అవకాశాలు మాత్రం లేవు. జీఎస్టీ అమలుకు ముందుతో పోలిస్తే సిగరెట్ సంస్థలపై పన్ను భారం తగ్గింది. తదనుగుణంగా సంస్థలు తమ ఉత్పత్తుల గరిష్ఠ చిల్లర విక్రయ ధరను(ఎంఆర్‌పీ) తగ్గించాల్సి ఉంటుంది. కానీ సిగరెట్లు ఆరోగ్యానికి హాని చేసే ఉత్పత్తులు కాబట్టి ధర తగ్గించి ధూమపానాన్ని ప్రోత్సహించేబదులు ప్రయోజనాలను సంస్థలు తమ ఖాతాలో జమచేసుకొని ఉండేవని జైట్లీ అన్నారు. కానీ, సంస్థలకు ప్రయోజనం చేకూర్చడం జీఎస్టీ మండలి ఉద్దేశం కాదన్నారు. అందుకే ముందస్తు సమావేశాన్ని ఏర్పాటు చేసిన అన్ని రాష్ర్టాల ఏకాభిప్రాయంలో సెస్సు పెంచడం జరిగిందన్నారు. అసలుకైతే వచ్చేనెల 5న మండలి సమావేశం కావాల్సి ఉంది. జీఎస్టీ అమలు తీరును సమీక్షించేందుకు ఆగస్టు తొలివారంలో మరోసారి సమావేశం కానున్నట్లు జైట్లీ వెల్లడించారు.
arun
మే 28న జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించిన ప్రకారం.. సిగరెట్లపై 28 శాతం పన్ను, 5 శాతం విలువ నిష్పత్తి ఆధారిత సుంకంతోపాటు అదనంగా స్థిరసెస్సు వర్తిస్తుంది. 65 మిల్లీమీటర్ల లోపు పొడవుండే వెయ్యి ఫిల్టర్ లేదా నాన్ ఫిల్టర్ సిగరెట్లపై స్థిర సెస్సును రూ.1,591గా నిర్ణయించారు. తాజాగా మరో రూ.485 పెరుగడంతో మొత్తం స్థిర సెస్సు రూ.2,076కు పెరిగింది. ఇక 65 నుంచి 70 మిల్లీ మీటర్ల పొడవుండే వెయ్యి నాన్ ఫిల్టర్ సిగరెట్లపై స్థిర సెస్సు గతంలో ఉన్న రూ.2,876 నుంచి రూ.3,668కి పెరిగింది. అదే సైజుండే 1000 ఫిల్టర్ సిగరెట్లపై సెస్సు రూ.2,126 నుంచి రూ.2,747కు పెరిగింది. ఇక 70 నుంచి 75 మిల్లీమీటర్ల సైజుండే వెయ్యి సిగరెట్లపై స్థిర సెస్సు రూ.3,668కి పెరిగింది. ఇతర సిగరెట్లకు 36 శాతం విలువ నిష్పత్తి ఆధారిత సుంకంతోపాటు రూ.4,170 స్థిర సెస్సు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో వీటిపై విలువ నిష్పత్తి ఆధారిత సుంకం 5 శాతంగా ఉండేది.
rajendar

త్వరలోనే నిర్ణయం!
ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల కాంట్రాక్టు పనులపై పన్ను తగ్గించే విషయమై మంత్రి ఈటలతో జైట్లీ
ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల కాంట్రాక్టు పనులపై 18శాతం పన్నును ఉపసంహరించాలని లేదా తగ్గించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ జైట్లీని కోరారు. జీఎస్టీ అమలు తీరుపై అరుణ్ జైట్లీ అన్ని రాష్ర్టాల ఆర్థిక మంత్రులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. సచివాలయం నుంచి మంత్రి ఈటల వీడియో కాన్పరెన్స్‌లో జైట్లీతో మాట్లాడారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కాంట్రాక్టులను 18శాతం పన్ను పరిధిలోకి తేవడం వల్ల చాలా భారం పడుతుందని అన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇది వరకే కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని మంత్రి ఈటల గుర్తు చేశారు. గతంలో మాదిరిగా పన్నురేటును 5శాతంలోపే నిర్ణయించాలని ఆయన సూచించారు. ఇదే విషయమై ఏపీ సర్కారు కూడా లేఖ రాసిందని జైట్లీ మంత్రికి తెలిపారు. కాంట్రాక్టు పనులపై పన్ను భారం తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నామని, త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా జైట్లీ స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్, వాణిజ్యపన్నుల కమిషనర్ అనీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

327

More News

VIRAL NEWS

Featured Articles