ఈడీ ఎదుట కొచ్చర్లు

Tue,May 14, 2019 12:54 AM

Chanda Kochhar, Deepak Kochhar appear before ED

-ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణం కేసులో హాజరు

న్యూఢిల్లీ, మే 13: ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణం కేసు విచారణలో భాగంగా వీరిరువురిని ఇక్కడి ఖాన్ మార్కెట్‌లోగల తమ ప్రధాన కార్యాలయంలో ఈడీ అధికారులు ప్రశ్నించారు. దాదాపు 9 గంటలపాటు విచారణ కొనసాగడం గమనార్హం. ఉదయం 11 గంటలకు మొదలై రాత్రి ఏడు గంటలు దాటిన తర్వాతగానీ విడిచిపెట్టలేదు. రుణ మంజూరులో అక్రమాలు, మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ కొచ్చర్లపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ముంబైలోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో కొచ్చర్లను అధికారులు ప్రశ్నించిన సంగతీ విదితమే. ఈ ఏడాది మార్చి 1న ఈ కేసులో భాగంగా అధికారులు సోదాలు నిర్వహించినప్పటి నుంచి కొచ్చర్లు విచారణలకు హాజరవుతున్నారు. వీడియోకాన్ గ్రూప్ అధినేత వేణుగోపాల్ ధూత్‌తోపాటు కొచ్చర్లకు చెందిన ముంబై, ఔరంగాబాద్‌ల్లోని కార్యాలయాలపై ఈడీ దాడులు నిర్వహించినది తెలిసిందే. కాగా, దీపక్ కొచ్చర్ సోదరుడు రాజీవ్ కొచ్చర్‌నూ ఈడీ అధికారులు విచారిస్తుండగా, కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కూడా రాజీవ్‌ను ప్రశ్నిస్తున్నది. రాజీవ్ కొచ్చర్.. సింగపూర్ ఆధారిత అవిస్తా అడ్వైజరీ సంస్థ వ్యవస్థాపకుడు. వీడియోకాన్ రుణ పునర్‌వ్యవస్థీకరణలో ఈ సంస్థ ప్రమేయం ఏమైనా ఉందా? అన్నదానిపై సీబీఐ ఆరా తీస్తున్నది. ఇక మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద వీరందరి వాంగ్మూలాల్ని అధికారులు రికార్డు చేస్తున్నారు. వీడియోకాన్ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంక్ ఇచ్చిన రూ.1,875 కోట్ల రుణం మంజూరులో అక్రమాలు జరిగాయన్న దానిపై ఈడీ క్రిమినల్ కేసు నమోదు చేసింది. సీబీఐ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈ కేసును నమోదు చేశారు. ధూత్‌కు చెందిన వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, వీడియోకాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, సుప్రీం ఎనర్జీ పేర్లనూ ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ పేర్కొన్నది.

831
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles