ఆన్‌లైన్ మార్కెట్‌లోకి సర్కార్!

Fri,November 16, 2018 12:07 AM

CAIT demands govt to launch e commerce portal for small traders

-చిరు వ్యాపారుల కోసం ఓ ఈ-కామర్స్ పోర్టల్
-కేంద్ర ప్రభుత్వానికి సీఏఐటీ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, నవంబర్ 15: చిరు వ్యాపారులు, కళాకారులు, మహిళా ఔత్సాహికులు తమ ఉత్పత్తులను పారదర్శక రీతిలో అమ్ముకునేలా ప్రభుత్వం ఓ ఈ-కామర్స్ వేదికను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అఖిల భారత వాణిజ్యదారుల సమాఖ్య (సీఏఐటీ) అభిప్రాయపడింది. ప్రస్తుతం ఆన్‌లైన్ మార్కెట్ జోరుకు సంప్రదాయ మార్కెట్ విలవిలలాడిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వమే ఓ ఆన్‌లైన్ మార్కెట్ వేదికను ప్రారంభించాలని అంటున్నది. ఈ క్రమంలోనే గురువారం కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేశ్ ప్రభుకు ఓ లేఖను రాయగా, అందులో పైవిధంగా విజ్ఞప్తి చేసింది. వాణిజ్య, వ్యాపార సంఘాల భాగస్వామ్యంతో ఈ ఆన్‌లైన్ పోర్టల్‌ను ముందుకు తీసుకురావాలని కోరింది. దీనివల్ల మార్కెట్‌లో నిరాదరణకు గురవుతున్న క్షేత్రస్థాయి వ్యాపార వర్గాలకు ప్రయోజనం చేకూరుతుందని, వినియోగదారులకూ లాభం అందుతుందన్నది.

బడా సంస్థల చేతుల్లోనే..

దేశంలో ఈ-కామర్స్ వ్యాపారం.. కొన్ని బడా సంస్థల చేతుల్లోనే ఉన్నదని, ఫలితంగా మార్కెట్‌లో వ్యాపార పరిస్థితులు ఆందోళనకరంగా తయారయ్యాయని ఈ సందర్భంగా సదరు లేఖలో సీఏఐటీ ఆరోపించింది. భారీ రాయితీలు, ధరల అస్థిరత వల్ల వ్యాపార రంగం కుదేలవుతున్నదని, తయారీ రంగం కూడా నష్టాలపాలవుతున్నదని దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది శుభ పరిణామం ఎంతమాత్రం కాదని హెచ్చరించింది. ప్రభుత్వం నిర్దేశించిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) మార్గదర్శకాలనూ ఈ-కామర్స్ సంస్థలు.. ముఖ్యంగా విదేశీ సంస్థలు తుంగలో తొక్కుతున్నాయని ధ్వజమెత్తింది. దీనివల్ల ఖజానాకు ఆదాయం తగ్గిపోతున్నదని గుర్తుచేసింది.

ఈ-కామర్స్ పాలసీపై..

దేశీయ విపణిలో ఈ-కామర్స్ మార్కెటీర్ల దుందుడుకు వైఖరికి కళ్లెం వేసేలా ఈ-కామర్స్ పాలసీని వీలైనంత త్వరగా తీసుకురావాలని కూడా ఈ సందర్భంగా ప్రభుకు రాసిన లేఖలో సీఏఐటీ డిమాండ్ చేసింది. ఆన్‌లైన్ మార్కెట్ పోకడను, లావాదేవీలను పర్యవేక్షించేలా ఓ నియంత్రణ వ్యవస్థనూ ఏర్పాటు చేయాలని సూచించింది.

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లపై విచారణ

విదేశీ మారకం చట్టాల నిబంధనలను ఉల్లంఘించాయా? అన్నదానిపై దేశ, విదేశీ ఈ-కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లపై దర్యాప్తు చేస్తున్నట్లు ఢిల్లీ హై కోర్టుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలియజేసింది. ఈ-కామర్స్ సంస్థల ఎఫ్‌డీఐ నిబంధనల ఉల్లంఘనపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై ఈడీ ఈవిధంగా కోర్టుకు తెలియజేసింది. ఈ నెల 19న దీనిపై తదుపరి విచారణను కోర్టు చేపట్టనున్నది.

917
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles