ఆర్థిక సంస్కరణలతో వ్యాపారం రూపు మారింది

Fri,August 10, 2018 12:49 AM

Business format has changed with economic reforms

-రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు
- ఐసీసీ సదరన్ రీజినల్ కౌన్సిల్ శాఖ ప్రారంభం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మాజీ ప్రధాన మంత్రి పీవీ నర్సింహా రావు ఆర్థిక సంస్కరణలతోనే దేశంలో వ్యాపార రంగం రూపం మారిందని, భారీ మార్పులు వచ్చాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. పార్క్ హయత్ హోటల్‌లో గురువారం జరిగిన ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్(ఐసీసీ) సదరన్ రీజినల్ కౌన్సిల్ విభాగం ప్రారంభ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీవీ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలతోనే వ్యాపారాల్లో భారీ ఎత్తున మార్పులు వచ్చాయన్నారు. ఎఫ్‌డీఐతో పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు వచ్చాయన్నారు. ప్రపంచంలో ఉత్తమ ఎయిర్ పోర్ట్‌లను నిర్మించిన సంస్థలు భారత్‌కు చెందినవేనని, అందులోనూ తెలుగువారేనని గుర్తుచేశారు. జీవీకే, జీఎంఆర్ లాంటి సంస్థలు నిర్మించాయన్న మంత్రి.. ప్రపంచంలో అతిపెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీలు, ఉత్తమ మౌలిక సదుపాయాల కంపెనీలు ఇక్కడే ఉన్నాయన్నారు.

ఎన్ని కంపెనీలు వచ్చాయనేది ముఖ్యం కాదని, ఎంత మందికి ఉపాధి కల్పించామన్నదే ముఖ్యమన్నారు. కాగా, ఉత్పత్తి రంగంలో జర్మనీని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మూతపడ్డ వాటిని తెరిపించడం-మూతపడేవాటిని ఆదుకోవడం, బలంగా ఉన్న వాటిని విస్తరించడం, కొత్త పరిశ్రమలను ఆకర్షించడం అనే త్రిముఖ లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. ఇబ్బందుల్లో ఉన్న పరిశ్రమల కోసం ఎస్‌పీవీ తరహాలో తెలంగాణ ఇండస్ట్రీయల్ హెల్త్ క్లీనిక్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. టీఎస్‌ఐపాస్ ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయన్నారు. టీఎస్‌ఐపాస్ ద్వారా రాష్ట్రానికి ఇప్పటివరకు 6,700 పరిశ్రమలు వచ్చాయని వివరించారు. దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబెటర్ టీ హబ్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలకు ఇది ఆదర్శంగా నిలిచిందని, రెండో దశ టీ హబ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.

విద్యుత్ సమస్యను అధిగమించాం


గత నాలుగేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందన్న కేటీఆర్.. రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లోనే విద్యుత్ సమస్యను అధిగమించామన్నారు. ప్రస్తుతం అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామన్నారు. వ్యవసాయానికి ఉచితంగా నిరంతర విద్యుత్‌ను సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అన్నారు. సోలార్ విద్యుదుత్పత్తిలో దేశీయంగా తెలంగాణ రెండో స్థానంలో ఉందని, రాబోయే డిసెంబర్ నాటికి మొదటి స్థానంలోకి రాగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇక గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. దీని కోసం చేపల పెంపకం, గొర్రెలు పంపిణీ చేస్తున్నామని తెలియజేశారు. సుదీర్ఘ చరిత్ర ఉన్న ఐసీసీ సదరన్ రీజినల్ శాఖను హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. పారిశ్రామిక వర్గాలతో కలిసి పనిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. పారిశ్రామికీకరణ పెరుగడం ద్వారా రాష్ట్రంలోని యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఇదిలావుంటే ఐసీసీ సదరన్ కౌన్సిల్ చైర్మన్‌గా తిక్కవరపు రాజీవ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.

377
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles