వ్యవసాయం చేయొచ్చు

Thu,February 1, 2018 09:05 AM

-ఈసారి బడ్జెట్‌లో రైతులకే పెద్దపీట అంటున్న నిపుణులు
-రేపే కేంద్ర వార్షిక బడ్జెట్

budget1
న్యూఢిల్లీ, జనవరి 30:భారతదేశం.. దాదాపు 130 కోట్ల జనాభా కలిగిన మన దేశంలో వ్యవసాయమే అత్యధికులకు జీవనాధారం. కంప్యూటర్ కాలంలోనూ ఇక్కడి నేలను నమ్ముకున్న కర్షక సోదరులు తక్కువేం కాదు. ప్రపంచ బ్యాంకు సులభతర వ్యాపార నిర్వహణ ర్యాంకు మెరుగుపడినా.. పారిశ్రామిక రంగం పరుగులు పెడుతున్నా.. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకున్న ప్రాధాన్యత మాత్రం చెక్కుచెదరడం లేదు. భారతీయతలో అంతగా మమేకమైపోయింది సాగుబడి. అలాంటిది రైతులకు రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితులేనన్న సంకేతాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. తాజా ఆర్థిక సర్వే ఇదే ఆందోళనను వ్యక్తం చేసింది. అందుకే ఈసారి బడ్జెట్‌లో వ్యవసాయానికి పెద్దపీట వేస్తుం దన్న అంచనాలు అంతటా వినిపిస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి(2018-19)గాను గురువారం పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్‌ను ప్రవేశ పెడుతుండగా, మోదీ సర్కారుకు ఇదే చివరి పూర్తికాల బడ్జెట్.

దీంతో రైతన్నలను ఆకట్టుకునే ప్రకటనలకు కొదువుండదంటున్నారు నిపుణులు. అందులోనూ త్వరలో ఆయా రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలుండటంతో తప్పక ఇది రైతాంగం మెచ్చే బడ్జెటే అవుతుందన్న అభిప్రాయాలున్నాయి. రైతులకు ఉపయోగపడని వృద్ధిరేటు దండుగ అని ఇటీవలే జైట్లీ కూడా అన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం తాను పార్లమెంట్‌కు సమర్పించిన ఆర్థిక సర్వే నివేదిక సైతం వ్యవసాయానికి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయన్నది. వాతావరణ మార్పుల కారణంగా రైతుల ఆదాయం 25 శాతం వరకు పడిపోయే వీలుందన్నది. ఈ నేపథ్యంలో రాబోయే బడ్జెట్‌లో జైట్లీ అధికంగా నిధులను కేటాయించే అవకాశాలే ఉన్నాయని మెజారిటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫసల్ బీమా యోజనకు రూ.11,000 కోట్ల నిధులివ్వాలని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ కోరుతుండగా, అంతకంటే ఎక్కువే దక్కుతాయన్న అంచనాలున్నాయి.

కాగా, వ్యవసాయ విద్య, పరిశోధనల కోసం ఈ బడ్జెట్‌లో మరిన్ని నిధులను కేటాయించే అవకాశాలూ కనిపిస్తున్నాయి. నీటిపారుదలకు అధిక కేటాయింపులు, గోదాముల నిర్మాణానికి రాయితీలివ్వనున్నారు. అలాగే రైతుల ఆదాయం రెండింతలు చేయాలన్న లక్ష్యంపైనా జైట్లీ శ్రద్ధ వహించనున్నారు. ఇక వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)లో ఇప్పటికే ఎరువులు తదితర వ్యవసాయోత్పత్తులపై పన్ను భారం తగ్గించారు జైట్లీ. వ్యవసాయ రుణాల రద్దు డిమాండ్లూ ఆయా రాష్ర్టాల నుంచి వినిపిస్తుండగా, ఇది చేస్తే ప్రభుత్వ ఖజానాపై వ్యయభారం పెరుగుతుందని, బ్యాంకులపై పెనుభారం మోపబడుతుందని ఆర్బీఐ హెచ్చరిస్తున్నది. అయినప్పటికీ దీనికి సంబంధించి కూడా బడ్జెట్‌లో స్పష్టమైన ప్రకటన రావచ్చన్న అభిప్రాయాలున్నాయి.

తెలంగాణ ప్రభుత్వ ఆలోచనలకు అద్దం పట్టిన సర్వే

దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకైన రైతన్న కష్టాలు తొలగించాల్సిన అవసరం ఎంతో ఉన్నదన్న తాజా ఆర్థిక సర్వే.. చాలా అంశాల్లో తెలంగాణ ప్రభుత్వ ఆలోచనలకు అద్దం పట్టింది. వ్యవసాయం విషయంలో ప్రస్తుతం తెలంగాణ సర్కారు అవలంభిస్తున్న విధానాలు భేష్ అని చెప్పకనే చెప్పింది. మిషన్ కాకతీయ, నీటిపారుదల ప్రాజెక్టులు, నిరంతర విద్యుత్, కనీస మద్ధతు ధర, ఎరువులు, విత్తనాల రాయితీ, డ్రిప్ ఇరిగేషన్, గోదాముల నిర్మాణం వంటివి కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని చేపడుతున్న విషయం తెలిసిందే. దీంతో ఈ తరహా చర్యలన్నింటినీ దేశవ్యాప్తంగా రైతుల కోసం అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఆర్థిక సర్వే రూపకర్త, ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ అభిప్రాయపడటం గమనార్హం.

స్టాండర్డ్ డిడక్షన్ కావాలి

రాబోయే బడ్జెట్‌లో మళ్లీ స్టాండర్డ్ డిడక్షన్‌ను అమల్లోకి తీసుకురావాలని వేతన జీవులు కోరుతున్నారు. వేతన జీవుల ప్రయోజనార్థం 1974-75లో పరిచయమైన స్టాండర్డ్ డిడక్షన్‌ను 2006లో ఉపసంహరించారు. ఉద్యోగులు తమ సంపాదనలో భాగమైన ఖర్చులను తిరిగి క్లయిమ్ చేసుకునేందుకు (పొందేందుకు) ఇది ఉపయోగపడేది. అయితే కనీస మినహాయింపు పరిమితి, 80సీలతో చేకూరుతున్న ప్రయోజనాల దృష్ట్యానే స్టాండర్డ్ డిడక్షన్‌ను వెనక్కి తీసుకున్నది. కాగా, స్టాండర్డ్ డిడక్షన్ విధానంలో రూ.5 లక్షల వరకు ఉన్న వేతనాలపై ఒకే రకంగా రూ.30,000 వరకు, ఆపై వేతనాలకు రూ.20,000 వరకు క్లయిమ్ చేసుకునే సౌకర్యం ఉండేది.
budget

అమల్లోకి భవంతర్ యోజన తరహా పథకం

వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నివారణకు బడ్జెట్‌లో మధ్యప్రదేశ్ ప్రభుత్వ భవంతర్ భుగ్తన్ యోజన తరహా పథకాన్ని జైట్లీ ప్రకటించే అవకాశాలున్నాయి. రైతు రక్షణ చర్యల్లో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకునే వీలున్నది. చాలా రాష్ర్టాల్లో పంటల ధరలు ఏమాత్రం లాభసాటిగా లేకపోవడంతో కనీస మద్ధతు ధర (ఎంఎస్‌పీ) దక్కని రైతన్నలకు పరిహారం అందే మార్గాలపై కేంద్రం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే గతేడాది మధ్యప్రదేశ్ ప్రభుత్వం సరికొత్తగా అమల్లోకి తెచ్చిన భవంతర్ యోజన మాదిరి పథకాన్ని ప్రవేశపెట్టాలనుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఎంఎస్‌పీ లభించకపోయినా, పండిన పంట అమ్ముడుకాకపోయినా రైతులకు ఈ పథకం ద్వారా ఆ రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తున్నది. నీతి ఆయోగ్ సైతం మార్కెట్‌లో కొన్ని పంటలకు ఎంఎస్‌పీ కంటే తక్కువ గిట్టుబాటైతే రైతులకు పరిహారం అందించే విధానం ఒకటి ఉండాలని కేంద్రానికి సూచిస్తున్నది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్‌తోనూ నీతి ఆయోగ్ సంప్రదింపులు జరుపుతున్నది.

ఈ పథకంపై ప్రధాని మోదీకి చౌహాన్ సమగ్ర వివరణ కూడా ఇచ్చారు. ఎంఎస్‌పీ, పంట నష్ట పరిహారం కోసం రైతులు ఆందోళన బాట పట్టడంతో నిరుడు అక్టోబర్ 11న భవంతర్ యోజనను చౌహాన్ ప్రారంభించారు. తెలంగాణసహా పలు రాష్ర్టాలూ ఈ పథకంపై ఆసక్తి కనబరుస్తుండగా, ఇప్పటికే చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర అధికారులు మధ్యప్రదేశ్‌లో పర్యటించి పథకం అమలు, దాని ప్రభావం గురించి తెలుసుకున్నారు. ఈ పథకం కింద రైతుల ఖాతాల్లోకే నేరుగా నగదు బదిలీ అవుతుంది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సూచించిన ధరలు, మధ్యప్రదేశ్‌తోపాటు సమీప రాష్ర్టాల హోల్‌సేల్ మార్కెట్ ధరల ఆధారంగా పరిహారం ఇవ్వబడుతున్నది. కాగా, ఈ పథకాన్ని వరిసహా 8 పంటలతోపాటు ఉల్లి, పప్పులు, సజ్జలకూ వర్తింపజేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తున్నది.

2017
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles