నేడే కేంద్ర బడ్జెట్

Thu,February 1, 2018 09:01 AM

-సార్వత్రిక బడ్జెట్‌పై ఎన్నో ఆశలు
-పల్లె జనుల ఆకాంక్షలను నెరవేర్చాలా..ద్రవ్యలోటు లక్ష్యాలకే పరిమితం కావాలా..
-డైలమాలో మోదీ ప్రభుత్వం

arun-jaitley1
సార్వత్రిక బడ్జెట్ 2018-19 ప్రతిపాదనకు సమయం ఆసన్నమైంది. దేశంలోని వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక, పెట్టుబడిదారీ వర్గాలు సహా కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షల నడుమ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ గురువారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఎన్డీయే సర్కారు ప్రతిపాదించనున్న చివరి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రామీణ ప్రజలకు, రైతులకు అర్థమయ్యేందుకు ఈసారి జైట్లీ హిందీలో ప్రసంగించనున్నారు. తద్వారా హిందీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న తొలి ఆర్థికమంత్రిగా జైట్లీ చరిత్రకెక్కనున్నారు.

సార్వత్రిక బడ్జెట్ 2018-19కు మరికొద్ది ఘడియల్లో తెర లేవబోతున్నది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గురువారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌కు నివేదించనున్న ఈ బడ్జెట్.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వానికి, ముఖ్యంగా బీజేపీకి పెను సవాళ్లను విసురుతున్నది. గత నాలుగు బడ్జెట్లతో పోలిస్తే జైట్లీకి ఇదే అత్యంత కఠినమైన బడ్జెట్‌గా ఆర్థిక నిపుణులు పరిగణిస్తున్నారు. దేశంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చిన తర్వాత జైట్లీ ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ ఇదే. అలాగే వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికలకు ముందు మోదీ సర్కారు ప్రవేశపెట్టనున్న చివరి పూర్తిస్థాయి బడ్జెట్ కూడా ఇదే కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ బడ్జెట్‌పై దేశంలోని వివిధ వర్గాలు, ప్రత్యేకించి గ్రామీణ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకోవడమే ఈ ఉత్కంఠకు కారణం. ప్రస్తుతం ఆపదలో ఉన్న వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించేందుకు, కొత్త ఉద్యోగాలను సృష్టించి దేశంలోని కోట్లాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి చూపడం ద్వారా దేశ ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చే చర్యలకు ఈ బడ్జెట్‌లో పెద్దపీట వేస్తారా? లేక ద్రవ్యలోటును కట్టడి చేసేందుకు నిర్ధేశించుకున్న లక్ష్యాలకే అంటిపెట్టుకుని ఉంటారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
arun-jaitley
అయితే ఎన్ని ఇబ్బందులున్నా కేంద్రం మాత్రం తన ద్రవ్య లోటు లక్ష్యాల నుంచి దృష్టి మరల్చకపోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. మధ్యతరగతి ఓటర్లతో పాటు పట్టణ ప్రాంతాల్లోని కార్మికులు, చిన్న వ్యాపారులపై మోదీ, ఆయన పార్టీ (బీజేపీ) ఎక్కువగా ఆధారపడినట్లు కనిపిస్తున్నప్పటికీ ప్రధానిగా మోదీ ఎదగడంలో గ్రామీణ ఓటర్లు కూడా అంతే సమానమైన పాత్రను పోషించారన్నది జగమెరిగిన సత్యం. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఎనిమిది రాష్ర్టాల శాసనసభలకు త్వరలో ఎన్నికలు జరుగనుండటంతో ఈసారి కేంద్ర బడ్జెట్‌పై ఎన్నికల రాజకీయాలే ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయని సుస్పష్టమవుతున్నది. గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ పునాదులు బలహీనపడ్డాయని గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో రుజువు కావడం, బీజేపీ పాలనలో ఉన్న మూడు పెద్ద రాష్ర్టాలు సహా వ్యవసాయం ఎక్కువగా జరిగే మరికొన్ని రాష్ర్టాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతో ఈసారి సార్వత్రిక బడ్జెట్‌లో అన్ని రంగాల కంటే గ్రామీణ రంగం నుంచే ఎక్కువ పోటీ ఎదురు కానున్నది.
budget
దేశంలోని 130 కోట్ల జనాభాలో గ్రామీణులే దాదాపు 70 శాతం మేరకు ఉన్నందున ఈ బడ్జెట్‌లో జైట్లీ గ్రామసీమలకు పెద్దపీట వేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి పల్లె జనుల సంక్షేమం కోసం కనీసం కొన్నయినా కొత్త పథకాలను ప్రకటించడంతో పాటు ప్రస్తుతం అమలులో ఉన్న ఎంఎన్‌ఆర్‌ఈజీఏ (ఉపాధి హామీ), రూరల్ హౌసింగ్, పంటల బీమా లాంటి పథకాలకు, సాగునీటి ప్రాజెక్టులకు మరిన్ని నిధులు కేటాయించవచ్చు. మరోవైపు పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) అమలు వలన ఎదురైన ఆర్థిక ఇబ్బందులతో తీవ్రంగా నష్టపోయిన సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఈ బడ్జెట్‌లో పన్నుల నుంచి, ముఖ్యంగా ఆదాయ పన్ను భారం నుంచి కొంత మేరకైనా ఉపశమనం లభిస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. బీజేపీ ఓటు బ్యాంకులో సామన్య, మధ్య తరగతి ప్రజలు చాలా కీలకపాత్ర పోషిస్తున్నందున బడ్జెట్‌లో మోదీ సర్కారు వీరిని కూడా విస్మరించలేదు. అలాగే గత కొన్నేండ్ల నుంచి స్తబ్ధుగా ఉన్న ప్రైవేటు పెట్టుబడులకు ఊతమివ్వాలంటే కార్పొరేట్ రంగానికి ఈ బడ్జెట్‌లో కేంద్రం కొంతమేరకైనా ఊరట కల్పించాల్సిన అవసరం ఉన్నది.

ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రామీణ ప్రజలను సంతృప్తిపరిచేందుకు నగదు లభ్యతను పెంచినట్లయితే అది ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోయడంతో పాటు ద్రవ్యలోటు లక్ష్యాలను చేరుకోవడంలో కేంద్రానికి ఇబ్బందికరంగా పరిణమిస్తుంది. అయినప్పటికీ ఈసారి బడ్జెట్‌లో ఎన్నికలకు సంబంధించిన లెక్కలకే ఎక్కువ ప్రాధాన్యత లభించడం ఖాయంగా కనిపిస్తున్నది. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి మరింత బీమా రక్షణ కల్పించడంతో పాటు కోల్ట్ సోరేజీ వసతులను విస్తరించేందుకు, వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌కు తరలించేందుకు వీలుగా రవాణా సదుపాయాలను మెరుగుపరిచేందుకు మోదీ సర్కారు ఈ బడ్జెట్‌ను ఉపయోగించుకోవచ్చు. అలాగే రహదారుల నిర్మాణం లాంటి మౌలిక వసతుల ప్రాజెక్టులతో పాటు రైల్వేల ఆధునీకరణకు ఎక్కువ నిధులను వెచ్చించడం ద్వారా దేశ ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేందుకు ఈ బడ్జెట్‌లో జైట్లీ తగిన చర్యలు చేపట్టే అవకాశం ఉన్నది. అయితే ఆసియా ఖండంలో మరెక్కడా లేనంతగా దేశంలో పెరిగిపోతున్న ద్రవ్యలోటుకు ఒకవైపు కళ్లెం వేస్తూనే మరో వైపు ఈ బడ్జెట్‌లో దేశ ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చే చర్యలు చేపట్టి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం నరేంద్ర మోదీ ప్రభుత్వానికి నిజంగా కత్తి మీద సాము లాంటి విషయమే.

మదుపరుల ఆశలు నెరవేరుతాయా?

ఈసారి బడ్జెట్‌లో ద్రవ్యలోటు ఒకవైపైతే.. మిగతా అన్ని అంశాలు మరోవైపు. ఎవరికి ఏ మేలు కలుగాలన్నా.. అది ద్రవ్యలోటునే ప్రభావితం చేయనున్నది మరి. ముఖ్యంగా ఈ బడ్జెట్ 2018-19.. మోదీ సర్కారుపై మదుపరుల విశ్వాసానికే పరీక్షగా పరిణమించింది. ప్రభుత్వ ఆదాయ, వ్యయాల మధ్య వ్యత్యాసానికి కొలమానమైన ద్రవ్యలోటును కట్టడి చేసేందుకు కేంద్రం మొగ్గుచూపుతుందా?.. లేదంటే పన్నుల కోతలు, ప్రోత్సాహకాల ద్వారా మదుపరుల ఆశలను నెరవేరుస్తుందా? అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. మొదట్నుంచి నరేంద్ర మోదీకి మదుపరులు పెద్ద ఎత్తున మద్దతునిస్తున్న విషయం తెలిసిందే. చూద్దాం.. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలున్న క్రమంలో వస్తున్న ఈ చివరి పూర్తికాల బడ్జెట్ మదుపరుల నమ్మకాన్ని నిలబెడుతుందా? లేదా? అన్నది.

1529
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles