త్రైమాసిక ఫలితాలే దిక్కు

Mon,October 7, 2019 12:25 AM

-మదుపరుల చూపు టీసీఎస్, ఇన్ఫీలపైనే
-ఈ వారం మార్కెట్ సరళిపై నిపుణుల అంచనా

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం త్రైమాసిక ఆర్థిక ఫలితాల ఆధారంగా ట్రేడ్ అవుతాయని నిపుణులు అంచ నా వేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) రెండో త్రైమాసికానికి (జూలై-సెప్టెంబర్)గాను దేశీయ ఐటీ రంగ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్‌లు తమ ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. గురువారం టీసీఎస్, శుక్రవారం ఇన్ఫోసిస్‌లు త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. దీంతో వీటి ఆధారంగా మదుపరులు తమ పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకునే అవకాశాలే ఎక్కువని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అమెరికా-చైనా వాణిజ్య చర్చలు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల కదలికలు, విదేశీ మదుపరుల పెట్టుబడులు వంటివి కూడా కీలకమేనని ఎపిక్ రిసెర్చ్ సీఈవో ముస్తఫా నదీమ్ అన్నారు. టీసీఎస్, ఇన్ఫోసిస్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు చాలా ముఖ్యం.

కొన్ని రంగాల్లో ఒడిదుడుకులకు ఆస్కారం ఉన్నది అని అంచనా వేశారు. ఇక మంగళవారం దసరా కావడంతో స్టాక్ మార్కెట్లకు సెలవు. దీంతో ఈ వారం నాలుగు రోజులే ట్రేడింగ్ జరుగనున్నది. కాగా, మదుపరులు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎండీ మోతీలాల్ ఓస్వాల్ అన్నారు. శుక్రవారం మార్కెట్లు ముగిశాక పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) గణాంకాలు వెలువడనుండగా, ఇవి కూడా కీలకమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బుధవారం జరిగే ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశం కూడా ప్రధానమేనని నిపుణులు గుర్తుచేస్తున్నారు. అంతర్జాతీయంగా అమెరికా ఉద్యోగ గణాంకాలు, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ తదుపరి సమావేశం ముఖ్యం అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ రిటైల్ రిసెర్చ్ అధిపతి సిద్ధార్థ్ ఖేమ్కా అన్నారు. గత వారం సెన్సెక్స్ 1,149.26 పాయింట్లు, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ 337.65 పాయింట్లు దిగజారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేట్లు మరో పావు శాతం తగ్గినా.. సూచీలు నష్టాల్లోనే ముగిసిన విషయం తెలిసిందే. సెన్సెక్స్ 434 పాయింట్లు నష్టపోయిన సంగతీ విదితమే.

మూడు రోజుల్లో రూ.3 వేల కోట్లు వెనక్కి

hshsj
విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపరులు (ఎఫ్‌పీఐ) భారతీయ మార్కెట్ల నుంచి పెట్టుబడులను పెద్ద ఎత్తున వెనుకకు తీసుకుంటున్నారు. ఈ నెలలో మూడు రోజులు ట్రేడింగ్ జరుగగా, ఈ మూడు రోజుల్లోనే రూ.3 వేల కోట్లకుపైగా పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలంటేనే అనాసక్తిని ప్రదర్శిస్తున్న ఎఫ్‌పీఐలు.. భారీ స్థాయిలో గతంలో పెట్టిన పెట్టుబడులను లాగేసుకుంటున్నారు. అక్టోబర్ 1, 3, 4 తేదీల్లో దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐలు వెనక్కి తీసుకున్న పెట్టుబడుల విలువ రూ.2,947 కోట్లు. రుణ మార్కెట్ల నుంచి మరో రూ.977 కోట్లు తరలిపోయాయి. దీంతో అటు స్టాక్, ఇటు రుణ మార్కెట్ల నుంచి ఈ మూడు రోజుల్లో పోయిన విదేశీ పెట్టుబడుల విలువ రూ.3,924 కోట్లుగా నమోదైంది. అక్టోబర్ 2న గాంధీ జయంతి కారణంగా స్టాక్ మార్కెట్లు మూతబడ్డ విషయం తెలిసిందే. గత నెల సెప్టెంబర్‌లోనూ స్టాక్ మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐలు రూ.7,850 కోట్ల పెట్టుబడులను లాగేసుకున్న సంగతీ విదితమే. కాగా, ఇటీవలి ద్వైమాసిక ద్రవ్యసమీక్షలో ఆర్బీఐ తగ్గించిన వడ్డీరేట్లు.. జీడీపీకి ఊతమివ్వగలవని, విదేశీ పెట్టుబడులనూ ఆకర్షించగలవని కార్వీ స్టాక్ బ్రోకింగ్ సీనియర్ మేనేజర్ అరుణ్ మంత్రి అన్నారు.

రూ.లక్ష కోట్లపైనే ఆవిరి

largeimg
స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలు.. మదుపరుల సంపదను అంతకంతకూ ఆవిరి చేస్తున్నాయి. సెన్సెక్స్ టాప్-10 సంస్థల్లో ఏడింటి మార్కెట్ విలువ గత వారం లక్ష కోట్ల రూపాయలకుపైగానే కరిగిపోయింది. ఇందులో ఒక్క హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కే రూ.30 వేల కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. రూ.30,198.62 కోట్లు చేజార్చుకున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ విలువ రూ.6,50,446.47 కోట్ల వద్దకు పడిపోయింది. ఐసీఐసీఐ బ్యాంక్ కూడా రూ.22,866.93 కోట్ల సంపదను కోల్పోయింది. ఫలితంగా రూ.2,67,265.32 కోట్లకు పరిమితమైంది. అలాగే కొటక్ మహీంద్రా రూ.15,624.6 కోట్లు, హిందుస్థాన్ యునిలివర్ రూ.14,287.76 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ రూ.10,178.84 కోట్లు, బజాజ్ ఫైనాన్స్ రూ.9,437.91 కోట్లు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ.824 కోట్లు మేర నష్టపోయాయి. అయితే టీసీఎస్ మార్కెట్ విలువ రూ.8,236.49 కోట్లు పెరిగింది. ఇన్ఫోసిస్ రూ.4,681.59 కోట్లు, ఐటీసీ రూ.5,344.62 కోట్లు చొప్పున పెరిగాయి. మార్కెట్ విలువ ఆధారంగా టాప్-10 సంస్థల్లో రూ.8,28,808.67 కోట్లతో రిలయన్స్ మొదటి స్థానంలో ఉన్నది. తర్వాతి స్థానంలో టీసీఎస్ కొనసాగుతున్నది.

276
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles