ఆ ఖాతాలు ఎవరివి?

Mon,November 11, 2019 04:07 AM

-స్విస్ బ్యాంక్‌లో నిద్రాణ దశలో 12 భారతీయ అకౌంట్లు
-తమవేనంటూ ముందుకురాని ఖాతాదారులు
-ఇలాగైతే సొమ్ము మా ప్రభుత్వానికేనంటున్న స్విస్ అధికారులు

న్యూఢిల్లీ/జ్యూరిచ్, నవంబర్ 10: స్విస్ బ్యాంక్‌లో భారత్‌కు చెందిన 12 ఖాతాలు నిద్రాణ దశలో ఉన్నాయి. ఇవి తమవేనని ఇప్పటిదాకా ఎవరూ ముందుకు రాలేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇలాగే పరిస్థితులు కొనసాగితే ఆ ఖాతాల్లోని సొమ్ము తమ ప్రభుత్వ ఖజానాకు చేరుతుందని స్విట్జర్లాండ్ అధికారులు హెచ్చరిస్తున్నారు. కాగా, ఇందులో బ్రిటిష్ పాలన నాటి ఖాతాలూ ఉండటం గమనార్హం. ఇక గత ఆరేండ్లుగా ఎవరి నుంచి ఈ ఖాతాలు మావేనన్న సమాచారం రాలేదని స్విస్ అధికారులు చెబుతున్నారు. దీంతో కొన్నింటి కాలపరిమితి ఈ నెల, వచ్చే నెలతో తీరిపోనుందని స్పష్టం చేస్తున్నారు. ఈ నెల 15తో లీలా తాలుక్‌దార్, ప్రమతా ఎన్ తాలూక్‌దార్ ఖాతాల కాలపరిమితి ముగియనుందని, అలాగే కిశోర్ లాల్, మోహన్ లాల్, చంద్రలత ప్రణ్‌లాల్ పటేల్ ఖాతాలకున్న గడువు డిసెంబర్‌తో అయిపోతుందని, ఈలోగా ఆస్తులు, నగదు కోసం దరఖాస్తు పెట్టుకోవచ్చని స్విస్ అధికారులు పేర్కొన్నారు. కలకత్తా (ఇప్పుడు కోల్‌కతా)కు చెందిన ఇద్దరు, డెహ్రాడూన్‌కు చెందిన ఒక్కరు, బాంబే (ప్రస్తుతం ముంబై)కు చెందిన ఇద్దరు ఈ జాబితాలో ఉండగా, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల్లో స్థిరపడినవారి పేర్లూ ఉన్నాయి.

3,500 ఖాతాలు

దాదాపు 3,500 ఖాతాలు స్విస్ బ్యాంకుల్లో నిద్రాణ స్థితిలో ఉన్నాయిప్పుడు. ఏటా వీటి సంఖ్య పెరుగుతూనే ఉన్నది. స్విస్ చట్టాల ప్రకారం ఖాతా తెరిచిన దగ్గర్నుంచి 60 ఏండ్లదాకా ఖాతాదారుని నుంచి ఎలాంటి సమాచారం లేదా లావాదేవీలు జరుగకపోతే.. సదరు ఖాతాల వివరాలను బహిర్గతం చేయాల్సి ఉంటుంది. కనీసం 500 స్విస్ ఫ్రాంక్స్ లేదా విలువ తెలియని ఆస్తులుంటే వాటి కోసం క్లయిములను ఆహ్వానించాలి. నిజానికి 2015 డిసెంబర్‌లో దాదాపు 2,600 నిద్రాణ ఖాతాలను బహిర్గతం చేశారు. వీటిల్లో రూ.300 కోట్లకుపైగా (దాదాపు 45 మిలియన్ స్విస్ ఫ్రాంక్స్) నగదు నిల్వలున్నాయి. ఇవన్నీ కూడా 1955 నుంచి నిశ్చలంగా ఉన్నాయి. అలాగే సుమారు 80 సేఫ్టీ అన్‌క్లయిమ్డ్ డిపాజిట్ బాక్స్‌లూ వాటి యజమానులు, వారి వారసుల కోసం బహిర్గతం చేసినట్లు స్విస్ వర్గాలు తెలిపాయి.

2020 సెప్టెంబర్‌లో..

స్విస్ బ్యాంక్.. నల్ల కుబేరుల సిరి, సంపదలకు కేరాఫ్ అడ్రస్. అందుకే అక్రమార్కుల భరతం పడుతామంటున్న మోదీ సర్కారు.. స్విట్జర్లాండ్‌తో సమాచార మార్పిడి ఒప్పందాలను చేసుకున్నది. ఈ క్రమంలోనే స్విట్జర్లాండ్‌లోని బ్యాంకింగ్, ఇతరత్రా ఆర్థిక సంస్థల్లో ఖాతాలున్న భారతీయుల వివరాలను తొలి విడుతలో భాగంగా స్విస్ అధికారులు కేంద్రానికి తెలియజేశారు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో మరో దఫా వివరాలు రానున్నాయి. ఒకప్పటితో పోల్చితే స్విస్ ప్రభుత్వంలోనూ మార్పు వచ్చింది. బ్లాక్‌మనీతో తమ బ్యాంకులను నింపేసుకున్న స్విస్.. ఇప్పుడు నల్ల కుబేరుల గుట్టు విప్పుతున్నది. పన్ను ఎగవేతదారులకు స్వర్గధామం మచ్చను తుడిపేసుకుంటున్నది.

917
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles