జలాన్ కమిటీ తొలి భేటీ

Wed,January 9, 2019 12:42 AM

Bimal Jalan panel holds 1st meeting to examine reserve size of RBI

- ఆర్బీఐ నగదు నిల్వల పరిమాణంపై చర్చ
- ఏప్రిల్‌లో నివేదికకు అవకాశం

న్యూఢిల్లీ, జనవరి 8: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నగదు నిల్వల పరిమాణంపై ఏర్పాటైన బిమల్ జలాన్ కమిటీ మంగళవారం తొలిసారిగా సమావేశమైంది. ఆర్బీఐ మాజీ గవర్నర్ జలాన్ నేతృత్వంలో ఓ కమిటీని నగదు నిల్వల పరిమాణం పరిశీలనకు ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం కలిసి నియమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆర్బీఐ వద్ద నగదు నిల్వలు ఏ స్థాయిలో ఉండాలి.. కేంద్రానికి ఎంతమేర డివిడెండ్ ఇవ్వాలన్న దానిపై ఆరుగురు సభ్యులుగల ఈ కమిటీ తాజాగా భేటీ అయ్యింది. ప్రస్తుతం ఆర్బీఐ వద్ద రూ.9.6 లక్షల కోట్లకుపైగా మిగులు నిల్వలు ఉన్నాయి. అయితే దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం నెలకొన్న విపత్కర పరిణామాల నేపథ్యంలో ఈ నిల్వల్లో రూ.3.3 లక్షల కోట్లు ఇవ్వాలంటూ ఆర్బీఐకి కేంద్రం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దీంతో అప్పటికే ఆర్బీఐకి, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు మధ్య ఉన్న విభేదాలు భగ్గుమనగా, సెక్షన్-7 వంటి అంశాలు ఈ గొడవల్ని తారాస్థాయికి తీసుకెళ్లాయి. ఈ క్రమంలో గవర్నర్ పదవికి ఊర్జిత్ పటేల్ అనూహ్యంగా రాజీనామా చేయగా, ఆయన స్థానంలో శక్తికాంత దాస్‌ను మోదీ సర్కారు వెంటనే నియమించిన సంగతీ విదితమే. కాగా, ఆర్బీఐ నుంచి కేంద్రం మధ్యంతర డివిడెండ్‌ను కోరుతుండటం, రూ.40,000 కోట్లు ఇచ్చే అవకాశాలున్న తరుణంలో జలాన్ కమిటీ భేటీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఏప్రిల్‌లో ఈ కమిటీ తమ నివేదికను సమర్పించే వీలున్నట్లు తెలుస్తున్నది. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్‌తోపాటు ఆర్బీఐ సెంట్రల్ బోర్డు సభ్యులు భరత్ దోషి, సుధీర్ మన్కద్, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎన్‌ఎస్ విశ్వనాథన్ తదితరులు జలాన్ కమిటీ సభ్యులుగా ఉన్నారు.
nandan-nilekani

నీలేకని నేతృత్వంలో డిజిటల్ ప్యానెల్

డిజిటల్ పేమెంట్స్ బలోపేతానికి నందన్ నీలేకని నేతృత్వంలో ఓ ఉన్నత స్థాయి కమిటీని మంగళవారం ఆర్బీఐ నియమించింది. దేశంలో మరింత భద్రమైన, రక్షణతో కూడిన డిజిటల్ చెల్లింపులకు తగిన సూచనలు, సలహాలను ఈ కమిటీ ఇవ్వనున్నది. ఐదుగురు సభ్యులుగల ఈ కమిటీ.. డిజిటల్ లావాదేవీల పెంపునకు దోహదపడే నిర్ణయాలు, ప్రోత్సాహకాలను ప్రకటించనుందని ఓ ప్రకటనలో ఆర్బీఐ తెలిపింది. తొలిసారి సమావేశమైన దగ్గర్నుంచి 90 రోజుల్లోగా కమిటీ నివేదికను సమర్పించనుందని కూడా చెప్పింది. ప్రస్తుతం ఇన్ఫోసిస్ వ్యవస్థాపక చైర్మన్‌గా ఉన్న నీలేకని.. ఆధార్ రూపకర్త కూడా అన్న విషయం తెలిసిందే. ఈ కమిటీలో ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ హెచ్‌ఆర్ ఖాన్, విజయా బ్యాంక్ మాజీ సీఈవో, ఎండీ కిశోర్ సన్సీ, ఐటీ, ఉక్కు మంత్రిత్వ శాఖల మాజీ కార్యదర్శి అరుణా శర్మ, ఐఐఎం అహ్మదాబాద్ సీఐఐఈ సెంటర్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ సంజయ్ జైన్ సభ్యులుగా ఉన్నారు.

525
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles