నిరాశపరిచిన టీసీఎస్

Fri,January 12, 2018 12:58 AM

BFSI hurts TCS pulls Q3 net down 3.6 Percent

-క్యూ3లో లాభం రూ.6,531 కోట్లు
-షేరుకు రూ.7 మధ్యంతర డివిడెండ్
rajesh-gopinathan
ముంబై, జనవరి 11: దేశంలో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నిరాశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను సంస్థ రూ.6,531 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.6,778 కోట్ల లాభంతో పోలిస్తే 3.6 శాతం క్షీణించగా, క్యూ2లో నమోదైన దాంతో పోలిస్తే మాత్రం ఒక శాతానికి పైగా పెరిగింది. అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలానికి సంస్థ రూ. 30,904 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 2016-17 ఏడాది ఇదే కాలానికి వచ్చిన రూ.29,735 కోట్లతో పోలిస్తే 3.9 శాతం వృద్ధిని కనబరిచింది. దేశీయ అకౌంటింగ్ ప్రమాణాలకు లోబడి సంస్థ ఈ ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను ప్రతి షేరుకు రూ.7 మధ్యంతర డివిడెండ్‌ను సంస్థ ప్రకటించింది. ఈ నెల చివరిలోగా ఈ డివిడెండ్ చెల్లింపులను జరుపనున్నది. బ్యాంకింగ్, ఆర్థికం, సేవలు, బీమా రంగాల్లో నిరాశాజనక పనితీరు కనబరుచడం వల్లనే లాభాల్లో గండిపడిందని టీసీఎస్ సీఈవో, ఎండీ రాజేష్ గోపీనాథన్ తెలిపారు. కంపెనీకి వచ్చిన మొత్తం ఆదాయంలో డిజిటల్ రంగం వాటా 22.1 శాతంగా ఉందని, అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 40 శాతం ఎగబాకిందని ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు.

గడిచిన త్రైమాసికంలో డిజిటల్ విభాగంలో తొలిసారిగా 50 మిలియన్ డాలర్ల కంటే అధిక విలువైన మూడు ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు చెప్పారు. వీటితోపాటు 20 మిలియన్ డాలర్ల విలువైనవి ఒప్పందాలు ఏడు కాగా, 10 మిలియన్ డాలర్లవి తొమ్మిది, 5 మిలియన్ డాలర్లవి 15 ఉన్నాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. డిజిటల్ రంగంతోపాటు రిటైల్, ఇండస్ట్రీ వర్టికల్ విభాగాలు కూడా మెరుగైన పనితీరును కనబరిచినట్లు చెప్పారు. ఇక వలసల విషయానికి వస్తే రెండో త్రైమాసికంలో నమోదైన 11.3 శాతంతో పోలిస్తే ఆ తర్వాతి త్రైమాసికానికిగాను 0.2 శాతం తగ్గి 11.1 శాతానికి పరిమితమైంది. నికరంగా గడిచిన మూడు నెలల్లో 12,534 మంది సిబ్బంది చేరడంతో మొత్తం సంఖ్య 3,90,880కి చేరుకున్నారు. అలాగే బిజినెస్ 4.0 నూతన విభాగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు, అలాగే డిజిటల్ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ అధికారి వీ రామకృష్ణన్ పేర్కొన్నారు. కంపెనీ షేరు ధర రూ.2,788.40 వద్ద స్థిరపడింది.

437
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles