బ్యాంకులపై గీతాంజలి పిడుగు


Mon,April 16, 2018 12:53 AM

-ఒకే దెబ్బకు రూ.8 వేల కోట్లు పెరుగనున్న ఎన్‌పీఏలు
-జనవరి- మార్చి త్రైమాసికంలో మరికొన్ని పెద్ద మొండి ఖాతాలు అదనం

PNB-Gitanjali
న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: మొండి బకాయిలు గణనీయం గా పేరుకుపోవడంతో సతమతమవుతున్న బ్యాం కింగ్ వ్యవస్థకు మరో చావుదెబ్బ తగలబోతున్నది. మార్చి 31వ తేదీతో ముగిసిన గత ఆర్థిక సంవత్సర (2017-18) చివరి త్రైమాసికంలో మొండి బకాయిలు లేదా నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) కనీసం మరో రూ.8 వేల కోట్లకుపైగా పెరుగనున్నాయి. భారీ కుంభకోణంతో కళంకితమైన గీతాంజలి జెమ్స్ గ్రూపునకు వివిధ బ్యాంకులు ఇచ్చిన రుణాలు మొండి బకాయిలుగా మారడమే ఇందుకు కారణం. మూలధన పెట్టుబడుల నిమిత్తం పలు బ్యాంకులు గీతాంజలి గ్రూపునకు ఇచ్చిన రుణాలను పునర్‌వ్యవస్థీకరించకపోవడంతో ఈ ఒక్క ఖాతా నుంచే రూ.8 వేల కోట్లు మొండి బకాయిలుగా మారబోతున్నాయి. అలహాబాద్ బ్యాంక్ నేతృత్వంలోని 21 బ్యాంకుల కన్సార్టియం 2010-11లో గీతాంజలి గ్రూపునకు తొలిసారి మూలధన పెట్టుబడి రుణాన్ని ఇచ్చింది. ఆ తర్వాత 2014లో ఐసీఐసీఐ బ్యాంకు ఆ గ్రూపునకు అత్యధిక స్థాయిలో దాదాపు రూ.900 కోట్ల రుణాన్ని ఇచ్చి లీడ్ బ్యాంకుగా అవతరించింది. ఈ విధంగా గీతాంజలి జెమ్స్‌కు పలు బ్యాంకులు రుణాలిచ్చాయి. మార్చి 31వ తేదీ నాటికి వాటిలో అనేక రుణాలను గీతాంజలి గ్రూపు తిరిగి చెల్లించడం గానీ వాటిని పునర్‌వ్యవస్థీకరించడం గానీ జరుగకపోవడంతో ఆ రుణాలను మొండి బకాయిలుగా ప్రకటించాల్సి ఉన్నదని బ్యాంకుల కన్సార్టయంకు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

దీంతో 2017-18 చివరి త్రైమాసికంలో గీతాంజలి ఖాతాతో పాటు మొండి బకాయిలుగా మారనున్న మరికొన్ని పెద్ద ఖాతాలు బ్యాంకులను వణికిస్తున్నాయి. దేశంలోని బ్యాంకుల్లో మొండి బకాయిలు డిసెంబర్ చివరి నాటికి రూ.8,40,958 కోట్లకు పెరిగాయి. వీటిలో పారిశ్రామిక రుణాలు అత్యధికంగా ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో సేవలు, వ్యవసాయ రంగాల రుణాలు ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

917

More News

VIRAL NEWS