బీవోబీ లాభంలో క్షీణత


Wed,November 15, 2017 12:18 AM

క్యూ2లో రూ.355 కోట్లుగా నమోదు
bob
న్యూఢిల్లీ, నవంబర్ 14: ప్రభుత్వరంగ ఆర్థిక సేవల సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ఆర్థిక ఫలితాలకు మొండి బకాయిల దెబ్బ తగిలింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.355 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు సంస్థ ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి నమోదైన లాభంతో పోలిస్తే 36 శాతం క్షీణత కనబరిచింది. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి అధికంగా నిధులు కేటాయించడం వల్లనే లాభాల్లో గండిపడిందని బ్యాంక్ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. జూలై-సెప్టెంబర్ మధ్యకాలంలో బ్యాంక్ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 3.68 శాతం ఎగబాకి రూ.12,490 కోట్లకు చేరుకుంది. నిరర్థక ఆస్తుల విషయానికి వస్తే స్వల్పంగా తగ్గి 11.16 శాతానికి పరిమితమయ్యాయి. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఇది 11.40 శాతంగా ఉంది. నికర ఎన్‌పీఏ కూడా 5.46 శాతం నుంచి 5.05 శాతానికి తగ్గినట్లు బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి. విలువ పరంగా చూస్తే స్థూల నిరర్థక ఆస్తుల విలువ రూ.46,306.83 కోట్లుగా నమోదవగా, నికర ఎన్‌పీఏ రూ. 19,572.62 కోట్లుగా ఉన్నాయి. సమీక్షకాలంలో మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ రూ.1,847.22 కోట్ల నిధులను వెచ్చించింది. గడిచిన త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 8.58 శాతం ఎగబాకి రూ.3,720 కోట్లకు చేరుకోగా, ఇతర మార్గాల ద్వారా రూ.1,737 కోట్లు లభించాయి. సెప్టెంబర్ 30 నాటికి బ్యాంక్ వ్యాపారం రూ.9.71 లక్షల కోట్లుగా నమోదైంది. స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి బ్యాంక్ షేరు ధర 1.51 శాతం లాభపడి రూ.174.40కి చేరింది.

119

More News

VIRAL NEWS