అభినవ దానకర్ణుడు.. అజీమ్ ప్రేమ్‌జీ

Thu,March 14, 2019 01:08 AM

-దాతృత్వ సేవలకు రూ.52,750 కోట్ల కేటాయింపు
-విప్రోలో మరో 34 శాతం షేర్లు ధారాదత్తం
న్యూఢిల్లీ, మార్చి 13: విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ తన దాతృత్వ గుణాన్ని మరోసారి చాటుకున్నారు. ఇప్పటికే దాతృత్వ సేవలకు వేల కోట్లను ఇచ్చిన ఈ బహుళ వ్యాపార దిగ్గజం.. ప్రస్తుతం సంస్థలో తనకున్న వాటా ల్లో దాదాపు 34 శాతం షేర్లనూ ఇచ్చేశారు. ఈ షేర్ల ద్వారా వస్తున్న ఆర్థిక ప్రయోజనాలను అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌కు ధారాదత్తం చేసేశారు. ఈ మేరకు సదరు ఫౌండేషన్ బుధవారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. తాజా సాయంతో ఫౌండేషన్‌కు ప్రేమ్‌జీ విరాళాల విలువ రూ.1.45 లక్షల కోట్లకు చేరిందని, ఇందులో విప్రో యాజమాన్యంలో 67 శాతం వాటా కూడా ఉందని వివరించింది. గతంలోనూ తన పేరిట ఉన్న విప్రో షేర్లను, ఇతర ఆస్తులను ఈ ఫౌండేషన్‌కు ప్రేమ్‌జీ కేటాయించిన విషయం తెలిసిందే.

దేశీయ ఐటీ రంగంలో మూడో అతిపెద్ద సంస్థగా వెలుగొందుతున్న విప్రో లిమిటెడ్‌లో గతేడాది డిసెంబర్ నాటికి అజీమ్ ప్రేమ్‌జీకి 74.3 శాతం వాటా ఉన్నది. బెంగళూరు ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ.. ఐటీతోపాటు పలు ఇతర వ్యాపార రంగాల్లోనూ ఉన్నది. అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌కు చైర్మన్‌గా ఉన్న అజీమ్ ప్రేమ్‌జీ.. విప్రో చైర్మన్‌గాను ఉన్న సంగతి విదితమే. కర్నాటకతోపాటు తెలంగాణ, ఉత్తరాఖండ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, పుదుచ్చెరి, మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ర్టాల్లో ఫౌండేషన్ సేవలందిస్తుండగా, ప్రధానంగా ప్రాథమిక విద్య అభివృద్ధికి దోహదపడుతున్నది. బెంగళూరులో అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీని కూడా ఫౌండేషన్ నిర్వహిస్తున్నది. ఉత్తర భారతంలోనూ తమ సేవలను విస్తరిస్తామని ఈ సందర్భంగా ఫౌండేషన్ తెలిపింది.

1919
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles