పేటీఎం నష్టం రూ.3,960 కోట్లు!

Wed,September 11, 2019 02:46 AM

At Rs 3,960 crore, losses mount 165% for Paytm parent One97

- గత ఆర్థిక సంవత్సరంలో 165 శాతం పెరుగుదల
- అనుబంధ సంస్థలతో చూస్తే నష్టం రూ.4,217 కోట్లు


న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: దేశీయ డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం పేటీఎం.. పీకల్లోతు నష్టాల్లో నడుస్తున్నది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) సంస్థ నష్టాలు మరింతగా పెరిగాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2017-18)తో పోల్చితే ఏకంగా 165 శాతం ఎగిశాయి. 2018-19లో పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ నికర నష్టం రూ.3,959.6 కోట్లుగా ఉన్నది. 2017-18లో ఇది రూ.1,490 కోట్లుగానే ఉన్నది. ఈ మేరకు తమ భాగస్వాములకు సంస్థ తెలియజేసింది. అంటే క్రిందటి ఆర్థిక సంవత్సరంలో రోజుకు రూ.11 కోట్లదాకా నష్టపోయిందన్నమాట. ఇక సంస్థ ఆదాయం గతంతో పోల్చితే స్వల్పంగా పెరిగి రూ.3,229 కోట్ల నుంచి రూ.3,319 కోట్లకు చేరింది. కాగా, సంస్థ ఏకీకృత నష్టం 2018-19లో రూ.4,217 కోట్లుగా ఉండగా, 2017-18లో రూ.1,604 కోట్లుగా నమోదైంది. దీంతో 162 శాతం పెరిగినైట్లెంది. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను చూస్తున్న పేటీఎం మనీతోపాటు పేటీఎం ఫైనాన్షియల్ సర్వీసెస్, పేటీఎం ఎంటర్‌టైన్‌మెంట్ సర్వీసెస్, ఇతర అనుబంధ సంస్థలన్నీ కూడా నష్టాల్లోనే ఉండటం గమనార్హం. పేటీఎం మనీ నష్టం రూ.36.8 కోట్లుగా ఉన్నట్లు వాటాదారులకు వన్97 కమ్యూనికేషన్స్ తెలిపింది. కాగా, సంస్థను దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశపెట్టాలని చూస్తున్నామని, దానికి ముందు సంస్థను లాభాల్లోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ చెబుతున్నారు. వచ్చే రెండేండ్లలో రూ. 20 వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నామని సంస్థ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

గూగుల్ పే, ఫోన్‌పేలతో గట్టి పోటీ

భారతీయ డిజిటల్ పేమెంట్స్ రంగంలో తిరుగులేని రారాజుగా వెలుగొందిన పేటీఎం ఆధిపత్యానికి గూగుల్ పే, ఫోన్‌పేలు బ్రేకులు వేశాయి. ఈ రెండింటి రాకతో పేటీఎం వైభవం తగ్గిపోయింది. అయితే చిన్నచిన్న వ్యాపారుల వద్ద ఇప్పటికీ పేటీఎందే హవా. అయినప్పటికీ డిజిటల్ లావాదేవీల్లో పేటీఎం వాటా మాత్రం పడిపోయింది.

యెస్ బ్యాంక్‌లో వాటా కోసం..

ప్రముఖ దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ యెస్ బ్యాంక్‌లో వాటా కోసం పేటీఎం చర్చలు జరుపుతున్నది. బ్యాంక్ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్ నుంచి ఈ వాటాను కొనేందుకు పేటీఎం వర్గాలు సంప్రదింపులు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. ఆర్బీఐ ఆమోదంపై ఈ డీల్ ఆధారపడి ఉన్నట్లు సదరు వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఈ విషయంపై స్పందించేందుకు పేటీఎం నిరాకరించింది. రాణా కపూర్ మాత్రం అందుబాటులో లేరు. యెస్ బ్యాంక్‌లో కపూర్, ఆయన అనుబంధ సంస్థలకు 9.6 శాతం వాటా ఉన్నది. ఈ మొత్తం వాటాను విక్రయించనున్నారా? అన్నదానిపై మాట్లాడేందుకు బ్యాంక్ వర్గాలూ విముఖత వ్యక్తం చేశాయి. ఈ ఏడాది జనవరి-మార్చిలో బ్యాంక్ ఎన్నడూ లేనివిధంగా రూ.1,506.64 కోట్ల నష్టాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. నిరుడు ఇదే వ్యవధిలో రూ.1,179.44 కోట్ల లాభాన్ని అందుకున్నది.

1132
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles