ఏక్ అచ్చే దిన్! ఆగిన రూపాయి పతనం

Thu,September 13, 2018 12:50 AM

At one stage the rupee recovered over Rs Reaching 7186 level

ఒక్కసారిగా ఆర్థికవ్యవస్థకు సంబంధించి సానుకూల వార్తలు ప్రవాహంలా వచ్చాయి. రూపాయి విలువ కనీస స్థాయిల నుంచి అనూహ్యంగా రికవరీ అయింది. మరోవైపు ఎగుమతులు పెరిగాయి. పెరుగుతుందని అంచనా వేసిన ద్రవ్యోల్బణం తగ్గింది. పారిశ్రామికోత్పత్తి పరుగులు పెట్టింది. స్టాక్ మార్కెట్టూ రెండు రోజుల భారీ పతనం నుంచి తేరుకుంది. వెరసి ఈరోజు ఇండియా షైనింగ్ నినాదాన్ని గుర్తుకు తెచ్చింది....

భారీ ఒడిదుడుకుల నడుమ కనీస స్థాయిల నుంచి రూపాయి భారీగా కోలుకుంది. ఒక దశలో రూ. 72.91కు పతనం అయిన డాలర్‌తో రూపాయి మారకం విలువ ఆ తర్వాత ఆర్థిక శాఖ అధికారుల ప్రకటనతో భారీగా కోలుకుంది. ఒక దశలో రూపాయికి పైగా కోలుకుని రూ. 71.86 స్థాయిని చేరుకుంది. అయితే మళ్లీ మధ్యాహ్నం తర్వాత 51 రికవరీ అయి రూ. 71.18 వద్ద ముగిసింది. మే 25న తర్వాత ఒక రోజులో ఇంతగా కోలుకోవడం ఇదే తొలిసారి. ప్రభుత్వం, రిజర్వ్‌బ్యాంక్‌లు రూపాయి మారకం విలువను అసాధారణ స్థాయిలకు పతనం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆర్థిక వ్యవహారా శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ ప్రకటించారు. దీనికి తోడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వారాంతంలోనే దేశ ఆర్థికవ్యవస్థపై సమీక్షను జరిపి కొన్ని చర్యలను ప్రకటించవచ్చుననే వార్తలు కూడా ఫారెక్స్ మార్కెట్‌లో సెంటిమెంట్‌ను పెంచాయి.

10 నెలల కనిష్ఠానికి ద్రవ్యోల్బణం

రిటైల్ ద్రవ్యోల్బణం పది నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఆహార ఉత్పత్తుల్లో ముఖ్యంగా పండ్లు, కూరగాయల ధరలు భారీగా తగ్గడంతో ఆగస్టు నెలకుగాను రిటైల్ ద్రవ్యోల్బణ 3.69 శాతానికి పరిమితమైందని కేంద్ర గణాంకాల శాఖ వెల్లడించింది. క్రితం నెలలో 4.17 శాతంగా నమోదైన గణాంకాలు, 2017 ఆగస్టులో నమోదైన 3.28 శాతంతో పోలిస్తే మాత్రం స్వల్పంగా పెరిగింది. అక్టోబర్ 2017లో ఇది 3.58 శాతంగా ఉన్నది. ఇంధన ధరలు భారీగా పెరిగినప్పటికీ ద్రవ్యోల్బణ గణాంకాలు పది నెలల కనిష్ఠానికి పడిపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ఆగస్టు 16 వరకు ఉన్న ధరల ఆధారంగా ఈ గణాంకాలను విడుదల చేసినట్లు డాటా వెల్లడించింది. మరోవైపు రూపాయి పతనమవుతుండటంతో దిగుమతి చేసుకునే ఉత్పత్తుల ధరలు భగ్గుమననున్నాయి. గత నెలలో ఆహార పదార్థాల ధరల సూచీ 1.37 శాతం నుంచి 0.29 శాతానికి జారుకోగా, కూరగాయల ధరలు 7 శాతంతో తగ్గడం సామాన్యుడికి ఊరట లభించినట్లు అయింది. జూలైలో 7 శాతం పెరిగిన పండ్ల ధరలు ఆ మరుసటి నెలలో 3.57 శాతానికి పరిమితమయ్యాయి.

రికార్డు స్థాయికి ఎగుమతులు

దేశీయ ఎగుమతులు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. పెట్రోలియం రంగం అంచనాలకుమించి వృద్ధిని నమోదు చేసుకోవడంతో గడిచిన నెలకుగాను ఎగుమతుల్లో 19.21 శాతం వృద్ధి నమోదైందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేశ్ ప్రభు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వీటి విలువ 27.84 బిలియన్ డాలర్లు. ప్రధానంగా పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతుల్లో 17.43 శాతం వృద్ధిని నమోదుచేసుకోవడం ఇందుకు దోహదపడ్డాయని చెప్పారు. ఇదే సమయంలో దిగుమతులు ఏడాది ప్రాతిపదికన 25.41 శాతం ఎగబాకి 45.24 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇంధన ధరలు భగ్గుమనడం దిగుమతులు భారీగా పెరుగడానికి ప్రధాన కారణమని చెప్పారు. దీంతో వాణిజ్యలోటు 17.4 బిలియన్ డాలర్లుగా నమోదైంది. జూలై నెలలో వాణిజ్య లోటు ఐదేండ్ల గరిష్ఠ స్థాయి 18.02 బిలియన్ డాలర్లుగా ఉన్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో ఎగుమతుల్లో 16.13 శాతం వృద్ధిని నమోదు చేసుకోగా, దిగుమతుల్లో 17.34 శాతం ఎగబాకాయి.

పారిశ్రామిక పరుగులు

పారిశ్రామిక రంగం పరుగులు పెట్టింది. గడిచిన కొన్ని నెలలుగా భారీ వృద్ధిని నమోదు చేసుకుంటున్న దేశీయ పారిశ్రామిక ప్రగతి జూలైలోనూ 6.6 శాతం పెరుగుదల కనిపించింది. ముఖ్యంగా తయారీ, క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్ విభాగాలు మెరుగైన పనితీరు కనబర్చడం వల్లనే పారిశ్రామికం రంగంలో ఎనలేని వృద్ధిని నమోదు చేసుకున్నది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో కేవలం ఒక్క శాతం మాత్రమే వృద్ధిని నమోదు చేసుకున్నదని కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. జూన్ నెల గణాంకాలను మాత్రం 7 శాతం నుంచి 6.8 శాతానికి తగ్గించింది. 2017 జూలైలో 0.1 శాతంగా ఉన్న తయారీ రంగంలో వృద్ధి ఈ సారి 7 శాతానికి ఎగబాకగా, కన్జ్యూమర్ డ్యూరబుల్ 14.4 శాతం పెరుగుదల కనిపించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి వృద్ధి 2.4 శాతం క్షీణించింది. అలాగే క్యాపిటల్ గూడ్స్ ఉత్పత్తి మూడు శాతం ఎగబాకింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలలు(ఏప్రిల్-జూలై మధ్యకాలానికి) 5.4 శాతం వృద్ధి నమోదైంది. 2017 సంవత్సరం ఇదే కాలానికి వృద్ధి 1.7 శాతంగా ఉన్నది. తయారీ రంగంలో ఉన్న 23 ఉత్పత్తుల్లో 22 సానుకూల వృద్ధిని నమోదు చేసుకోగా, కేవలం ఒక్కటి మాత్రమే ప్రతికూలానికి జారుకున్నది.

1579
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles