ఇక డిజిటల్ చెల్లింపులు జూమ్!


Tue,September 19, 2017 01:07 AM

ఆధునిక టెక్నాలజీతో మరింత పుంజుకోనున్నాయ్: జైట్లీ
google
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆర్థిక లావాదేవీల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో డిజిటల్ మార్గాన్ని ఎంచుకున్నవారికి ఆన్‌లైన్ చెల్లింపులు అలవాటుగా మారాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, ఆధునిక సాంకేతికతలతో మున్ముందు డిజిటల్ లావాదేవీలు భారీగా పుంజుకోనున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఏడాది నవంబర్ 8న ప్రకటించిన రూ.500, రూ.1000 నోట్ల రద్దు నిర్ణయం తర్వాత మార్కెట్లో కరెన్సీ చలామణి తగ్గుముఖం పట్టిందన్నారు.

గత ఏడాది నవంబర్, డిసెంబర్‌తోపాటు ఈ సంవత్సరం జనవరిలో చాలామంది చెల్లింపుల కోసం డిజిటల్ మార్గాన్ని ఎంచుకున్నారని, సౌఖ్యంగా ఉండటంతో అలవాటుగా చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో డిజిటల్ చెల్లింపులు ఆల్‌టైం గరిష్ఠానికి చేరుకున్నాయని, ఆ తర్వాత కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ మళ్లీ పుంజుకోవచ్చని సోమవారం గూగుల్ తేజ్ డిజిటల్ చెల్లింపుల యాప్‌ను విడుదల చేసిన సందర్భంగా అన్నారు. తేజ్ అంటే హిందీ భాషలో వేగం అని అర్థం. ప్రత్యేకంగా భారత కస్టమర్ల కోసం గూగుల్ సంస్థ ఈ యాప్‌ను అభివృద్ధి చేసింది.

దేశంలో డిజిటల్ లావాదేవీలను పెంపొందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టిందన్న జైట్లీ.. తద్వారా ఆన్‌లైన్ చెల్లింపులు భారీగా వృద్ధి చెందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద నోట్ల రద్దు ప్రయోజనాల గురించి ఆయన ప్రస్తావిస్తూ.. అధిక విలువ చేసే కరెన్సీ నోట్ల చలామణి గణనీయంగా తగ్గుముఖం పట్టిందన్నారు. అలాగే ప్రత్యక్ష, పరోక్ష పన్ను వసూళ్ల పరిధి కూడా పెరిగిందన్నారు.

తెలుగులోనూ గూగుల్ తేజ్!

googletez
అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం గూగుల్.. భారత్‌లో మొబైల్ చెల్లింపుల సేవలు ప్రారంభించింది. ఇందుకోసం గూగుల్ తేజ్ పేరుతో మొబైల్ అప్లికేషన్‌ను (యాప్) రూపొందించింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఈ యాప్ ద్వారా మొబైల్ వినియోగదారులు వర్చువల్ అడ్రస్ సాయంతో తమ బ్యాంక్ ఖాతా నుంచి ఇతరుల ఖాతాకు సొమ్ము బదిలీ చేయవచ్చు. లేదా చెల్లింపులు జరుపవచ్చు. అదీ ఎలాంటి రుసుము చెల్లించకుండా. డబ్బులు పంపదలుచుకున్న బ్యాంక్ ఖాతా నంబర్ లేదా ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ వంటి వివరాలు కూడా అవసరం లేదు. ప్రత్యేకంగా భారతీయ కస్టమర్ల కోసమే రూపొందించిన ఆండ్రాయిడ్, ఐవోఎస్ (ఐఫోన్) ఆపరేటింగ్ సిస్టమ్‌లకు సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు, ఇంగ్లిష్‌తోపాటు ఏడు భారతీయ భాషల్లో (హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, మరాఠి, బెంగాలీ, గుజరాతీ) ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు గూగుల్ వెల్లడించింది.

ఈ యాప్ సైజు 7 మెగాబైట్‌లు. ప్రస్తుతం దేశంలో 50కిపైగా బ్యాంకులు యూపీఐ టెక్నాలజీని సమకూర్చుకొన్నాయి. తేజ్ యాప్ ద్వారా ఈ బ్యాంకుల ఖాతాలకు జరిపే చెల్లింపులను ప్రాసెస్ చేసేందుకు గూగుల్ సంస్థ నాలుగు బ్యాంకులతో (యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ) భాగస్వామ్యం కుదుర్చుకుంది. తేజ్ యాప్ విడుదల కార్యక్రమంలో గూగుల్ ఇండియా, ఆగ్నేయ ఆసియా విభాగ వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనంద్ మాట్లాడుతూ.. దేశంలో 40 కోట్ల మంది ఇంటర్నెట్ సేవలు వినియోగిస్తుండగా, అందులో 30 కోట్ల మంది మొబైల్ ద్వారా నెట్ యాక్సెస్ చేస్తున్నారని అన్నారు. 2020కల్లా దేశంలో నెటిజన్ల సంఖ్య 65 కోట్లకు చేరుకోవచ్చని ఆయన అన్నారు. అందరి అవసరాలు తీర్చగలిగే అంతర్జాలాన్ని ఏర్పాటు చేయడమే గూగుల్ లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. మున్ముందు తేజ్ ప్లాట్‌ఫాం ద్వారా మొబైల్ వ్యాలెట్లను, కార్డ్స్‌ను అనుసంధానించాలని అనుకుంటున్నట్లు రాజన్ తెలిపారు. రూ.50కి పైగా విలువ చేసే లావాదేవీలపై గరిష్ఠంగా రూ.1000 విలువ చేసే స్క్రాచ్ కార్డులను కూడా అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. లావా, మైక్రోమ్యాక్స్, గ్జోలో, నోకియా, పానసోనిక్ వంటి కంపెనీలు మరికొద్ది నెలల్లో తేజ్ యాప్‌తో కూడిన మొబైల్ హ్యాండ్‌సెట్ మోడళ్లను మార్కెట్లోకి అందుబాటులోకి తేనున్నాయి.

223

More News

VIRAL NEWS