సింగరేణి బొగ్గు అమ్మకాలకు ఈ-ఆక్షన్‌

Wed,July 10, 2019 04:26 AM

Arrangements for the sale of 14.4 lakh tonnes

-ఈ నెల 16 నుంచి ప్రారంభం
-14.4 లక్షల టన్నుల విక్రయానికి ఏర్పాట్లు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: విద్యుత్తేతర పరిశ్రమలకు కావాల్సిన బొగ్గును ఈ-ఆక్షన్‌ ద్వారా అమ్మేందుకు సింగరేణి సంస్థ ఏర్పాట్లు చేసింది. ఈ పద్ధతిలో ఇప్పటికే 150 పరిశ్రమలకు 107 లక్షల టన్నుల బొగ్గును విక్రయించిన సింగరేణి సంస్థ.. తాజాగా మరో 14.4 లక్షల టన్నుల బొగ్గును ఈ-ఆక్షన్‌లో అమ్మేందుకు సన్నాహాలు చేసింది. ఈ నెల 16 నుంచి ఈ-ఆక్షన్‌ మొదలవుతుందని, దీనిని పరిశ్రమలు సద్వినియోగం చేసుకోవాలని సింగరేణి మార్కెటింగ్‌ జీఎం ఆంటోని రాజా సూచించారు. ఈ అమ్మకాలపై ఆయా పరిశ్రమలకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో మంగళవారం సదస్సును నిర్వహించారు. తెలంగాణతోపాటు ఏపీ, కర్ణాటక రాష్ర్టాల్లోని సిమెంట్‌, పేపర్‌, క్యాప్టివ్‌ పవర్‌ ప్లాంట్లు, ఎరువులు, మందుల పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సింగరేణి కోల్‌ మూవ్‌మెంట్‌ ఈడీ జే అల్విన్‌, జీఎం జీ వెంకటేశ్వరరెడ్డి, ఎజీఎం ఎన్వీకే శ్రీనివాస్‌, డీజీఎంలు ఎన్వీ రాజశేఖర్‌రావు, టీ శ్రీనివాస్‌.. ఈ-ఆక్షన్‌ ప్రక్రియ గురించి పరిశ్రమల ప్రతినిధులకు వివరించారు. గతంలో ఈ తరహా పరిశ్రమలు సింగరేణి నుంచి బొగ్గు కొనాలంటే ఢిల్లీ నుంచి అనుమతులు పొందాల్సివచ్చేది. అదెంతో వ్యయప్రయాసలతో కూడిన వ్యవహారమే కాకుండా బొగ్గు కేటాయింపు జరిగిందో లేదో తెలుసుకునేందుకు చాలా సమయం పట్టేది. ఈ నేపథ్యంలో కేంద్ర బొగ్గు గనులశాఖ పాత విధానాన్ని పూర్తిగా సరళీకరించి ఈ-ఆక్షన్‌ విధానంతో పరిశ్రమలు నేరుగా ఉత్పత్తిదారుల నుంచి బొగ్గును కొనుగోలుచేసే అవకాశాన్ని కల్పించింది. ఐటీసీ, నవ భారత్‌, సిర్పూర్‌ పేపర్‌ మిల్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, దివీస్‌, కేశోరాం సిమెంట్స్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, మైహోమ్‌, భవ్య, రెయిన్‌ సిమెంట్స్‌ తదితర 29 పరిశ్రమల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు.

820
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles