సదాశివ్‌పేట్‌లో ఏఆర్‌ఎల్ టైర్ల ప్లాంట్

Tue,June 11, 2019 12:47 AM

ARL Tyre Manufacturers Plant in Sadasivpet

-రూ.225 కోట్లతో ఏర్పాటు చేయబోతున్న సంస్థ

హైదరాబాద్, జూన్ 10: ప్రముఖ టైర్లు, ట్యూబ్‌ల తయారీ సంస్థ అగర్వాల్ రబ్బర్ లిమిటెడ్ (ఏఆర్‌ఎల్) రాష్ట్రంలో మరో ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే హైదరాబాద్‌లో రెండు ప్లాంట్లను ఏర్పాటు చేసిన సంస్థ..తాజాగా సదాశివ్‌పేట్ వద్ద 45 ఎకరాల విస్తీర్ణంలో మరో యూనిట్‌ను నెలకొల్పబోతున్నట్లు కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ కుమార్ అగర్వాల్ తెలిపారు. తొలి విడుతలో భాగంగా రూ.225 కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం రెండు రెట్లు పెరుగనున్నదన్నారు. ప్రస్తుతం ఉన్న రెండు యూనిట్లలో రోజుకు 70 మిలియన్ టన్నుల రబ్బర్ ఉత్పత్తి అవుతుండగా, వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి అందుబాటులోకి రానున్న ఈ మూడో యూనిట్‌తో ఈ సామర్థ్యం 150 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. తద్వారా అంతర్జాతీయ మార్కెట్లో వ్యాపారాన్ని భారీగా విస్తరించడానికి ఉపయోగపడనున్నదన్నారు. ఈ నూతన ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నయన్నారు. ప్రస్తుతం ఉన్న రెండు యూనిట్లలో 1,700 మంది విధులు నిర్వహిస్తున్నారు.

మూడేండ్లలో వెయ్యి కోట్ల టర్నోవర్

మూడు దశాబ్దాల క్రితం టైర్లు, ట్యూబ్‌ల మార్కెట్లోకి అడుగుపెట్టిన సంస్థ మార్కెట్లో తనదైన ముద్రవేసుకున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.300 కోట్లుగా నమోదైన టర్నోవర్..వచ్చే మూడేండ్లకాలంలో వెయ్యి కోట్ల రూపాయలకు చేరుకునే దానిపై ఆయన గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేశారు. సంస్థ ఆదాయంలో సగ భాగం దేశీయ అమ్మకాల ద్వారా, మిగతా సగం విదేశీ ఎగుమతుల ద్వారా లభిస్తున్నదన్నారు. ప్రస్తుతం సంస్థ ద్వి, త్రిచక్ర వాహన టైర్లు, ట్యూబ్‌లను 50 దేశాలకు ఎగుమతి చేస్తున్నది. గడిచిన ఆరు నెలలుగా ఆటోమొబైల్ మార్కెట్ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నదన్నారు. వ్యవసాయ ఆధారిత వాహనాల టైర్లతోపాటు విమాన టైర్లలో వాడే ట్యూబ్‌లను ఇక్కడే తయారు చేస్తున్నట్లు అగర్వాల్ చెప్పారు.

1099
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles