ఏపీ గ్రామీణ వికాస బ్యాంక్ లాభంలో భారీ వృద్ధి


Wed,May 16, 2018 12:21 AM

LIC
హైదరాబాద్, మే 15: వరంగల్ కేంద్రంగా బ్యాంకింగ్ సేవలు అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.503.01 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కిందటిసారి రూ.351.99 కోట్ల లాభంతో పోలిస్తే 42.80 శాతం వృద్ధి నమోదైందని బ్యాంక్ చైర్మన్ వీ నర్సిరెడ్డి తెలిపారు. వ్యాపారం విషయానికి వస్తే రూ.28,650.33 కోట్లకు చేరుకుందన్నారు. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 1.69 శాతం (రూ.209.74 కోట్లు) నుంచి 1.36 శాతానికి(రూ.195.64 కోట్లు), నికర ఎన్‌పీఏ 0.72 శాతం నుంచి 0.20 శాతానికి తగ్గినట్లు చెప్పారు. ఈ ఏడాది మొండి బకాయిలు లేని బ్యాంకుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. వ్యాపార విస్తరణలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 80 శాఖలను, 600 మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు నర్సిరెడ్డి తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20 శాతం వృద్ధిని నమోదు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంలో కూడా బ్యాంకు పాలుపంచుకుంటున్నదని, ఐదు జిల్లాల్లోని 30 మండలాల్లో చెక్కులను పంపిణి చేస్తున్నట్లు చెప్పారు.

ఈ ఏడాది ఐపీవోకి: వచ్చే మార్చిలోగా బ్యాంక్ స్టాక్ మార్కెట్లో లిస్టయ్యే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. డిజిన్వెస్ట్‌మెంట్‌లో భాగంగా ఇప్పటికే బ్యాంకులో వాటా విక్రయ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని, కానీ ఆర్బీఐ, సెబీ నుంచి అనుమతి పొందాల్సి ఉందని వెల్లడించారు. ప్రస్తుతం బ్యాంకులో కేంద్రం 50 శాతం వాటా కలిగివుండగా, రాష్ట్ర ప్రభుత్వానికి (ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం) 15 శాతం, ఎస్‌బీఐకి 35 శాతం వాటా ఉన్నది.

484

More News

VIRAL NEWS