వచ్చే ఐదేండ్లలో 6,500 కోట్ల పెట్టుబడి


Mon,July 17, 2017 12:43 AM

అమెరికా మార్కెట్లో వ్యాపార విస్తరణకు మహీంద్రా గ్రూపు ప్రణాళిక
anand
న్యూయార్క్, జూలై 16: దేశీయ పారిశ్రామిక దిగ్గజ గ్రూపుల్లో ఒకటైన మహీంద్రా.. అమెరికా మార్కెట్‌లో వ్యాపార విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం వచ్చే ఐదేండ్లలో 100 కోట్ల డాలర్లు (మన కరెన్సీలో రూ.6,500 కోట్లు) పెట్టుబడిగా పెట్టనున్నట్లు తెలిపింది. ఎందుకంటే, యూఎస్ మార్కెట్ నుంచి ఆదాయ ఆర్జన సామర్థ్యాన్ని రెట్టింపు స్థాయికి (500 కోట్ల డాలర్లకు) పెంచుకోవాలనుకుంటున్నది. ప్రస్తుతం అమెరికాలో ఏడు రకాల వ్యాపారాలు నిర్వహిస్తున్న మహీంద్రా గ్రూపునకు వాటి ద్వారా ఏటా 250 కోట్ల డాలర్ల ఆదాయం సమకూరుతున్నది. అందులో ఐటీ సంస్థ టెక్ మహీంద్రాతోపాటు ట్రాక్టర్లు, యుటిలిటీ వాహనాల విభాగం మహీంద్రా అండ్ మహీంద్రా యూఎస్‌ఏ ప్రధానమైనవి. అక్కడి ఏవియేషన్, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, సరుకు రవాణా రంగాల్లోనూ వ్యాపారాలు నిర్వహిస్తున్నది.

మహీంద్రా గ్రూపునకు చెందిన అమెరికా విభాగాల్లో ప్రస్తుతం 3 వేల మందికి పైగా పనిచేస్తున్నారు. అక్కడ వ్యాపారాన్ని విస్తరించేందుకు వచ్చే ఐదేండ్లలో సిబ్బంది సంఖ్యను సైతం రెట్టింపు చేయాలనుకుంటున్నది. ఇప్పటివరకు అమెరికాలోని మా గ్రూపు వ్యాపారాలన్నింటిలో కలిపి వంద కోట్ల డాలర్లు పెట్టుబడిగా పెట్టాం. వచ్చే ఐదేండ్లలో అంతే మొత్తంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాం అని మహీంద్రా అండ్ మహీంద్రా ఎండీ పవన్ గోయెంకా తెలిపారు.

ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై ప్రోత్సాహకాలివ్వాలి: ఆనంద్ మహీంద్రా
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు పెరుగాలంటే ధరలు తగ్గేలా ప్రభుత్వం ప్రోత్సాహకాలు కల్పించాల్సిన అవసరం ఉందని ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్రా అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో బ్యాటరీల భారీ ధర కారణంగా కస్టమర్లు ఈ విభాగ కార్లను కొనుగోలు చేయడానికి వెనుకాడుతున్నారని మహీంద్రా పేర్కొన్నారు. కాబట్టి ఈ వాహనాల కొనుగోలు పెరిగేందుకు కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు కల్పించాలని అన్నారు. రోడ్డు ట్యాక్స్ తగ్గించడం, బీమా సబ్సిడీ, ఇంకా ఇతర రూపాల్లో ఈ ప్రోత్సాహకాలను అందించవచ్చన్నారు. అంతేకాదు, ఎలక్ట్రిక్ వాహనాల కోసం పెద్ద ఎత్తున రీచార్జ్ స్టేషన్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

211

More News

VIRAL NEWS