బాదుడు మొదలైంది

Tue,December 3, 2019 12:45 AM

-అందరికీ అన్‌లిమిటెడ్ ఫ్రీ కాల్స్ ఉండవు
-అమల్లోకి వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ కొత్త టారీఫ్‌లు
-వినియోగదారులపై ప్రత్యేక రీచార్జ్‌ల భారం

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: ఉచిత అపరిమిత కాల్స్, చౌక డేటాకు కాలం తీరింది. సోమవారం అర్ధరాత్రి నుంచి ప్రీ-పెయిడ్ మొబైల్ చార్జీలను వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్ పెంచేశాయి. దీంతో నిన్నమొన్నటిదాకా అపరిమితంగా మోగిన మొబైల్స్.. ఇక పరిమితంగా వినిపించనున్నాయి. తమ నెట్‌వర్క్ పరిధిలోని వినియోగదారులకు ఉచిత కాల్స్‌ను అందిస్తున్న సంస్థలు.. ఇతర నెట్‌వర్క్ కస్టమర్లకు చేసే కాల్స్‌పై నిమిషానికి 6 పైసలు చొప్పున వసూలు చేస్తాయి. ఇప్పటికే జియో ఈ తరహా విధానాన్ని అందుబాటులోకి తీసుకురాగా, వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ కూడా అదే బాటలోకి వచ్చాయి. ఈ రెండు సంస్థలు తమ మొబైల్ టారీఫ్‌లను 50 శాతం వరకు పెంచేశాయి. అంతేగాక అపరిమిత ఉచిత కాల్స్‌కు తెరదించాయి. అసలే ఆర్థిక మందగమనం దెబ్బకు ఆదాయం పడిపోయి ఇబ్బందుల్లో ఉన్న సామాన్యులకు ఈ పెంపు శరాఘాతమే అవుతున్నది. ఇతర నెట్‌వర్క్‌ల్లో ఉన్న తమ స్నేహితులు, బంధువులతో మాట్లాడేందుకు ప్రత్యేక రీచార్జీలను చేసుకోవాల్సి వస్తున్నది.

జియోకే టారీఫోత్సాహం: జేఎం

మొబైల్ చార్జీల పెంపు.. వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్ కంటే రిలయన్స్ జియోకే ఎక్కువగా లాభించేలా ఉన్నది. పెంపు వల్ల ఎయిర్‌టెల్‌కు రూ.2,400 కోట్లు, వొడాఫోన్‌కు రూ.2,100 కోట్లు, జియోకు రూ.3,900 కోట్ల మేర త్రైమాసిక ఆదాయం పెరుగవచ్చని జేఎం ఫైనాన్షియల్ అంచనా వేసింది. జియో పెంపు వివరాలను తెలుపకపోయినా.. 40 శాతం వరకే భారం పడుతుందని స్పష్టం చేసింది. అంతేగాక తమ కస్టమర్లకు 300 శాతం అధిక ప్రయోజనాన్ని అందిస్తామని ప్రకటించింది. దీంతో సోమవారం ఉదయం స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌పై ఆ ప్రభావం స్పష్టంగా కనిపించిందని జేఎం ఫైనాన్షియల్ చెబుతున్నది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ దాదాపు రూ.22,650 కోట్లు పెరిగింది. ఇదే సమయంలో ఎయిర్‌టెల్ షేర్ల విలువ రూ.9,370 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.2,730 కోట్లు పుంజుకున్నది.

పెంపు మంచిదే: సీవోఏఐ

మొబైల్ కాల్స్, ఇంటర్నెట్ ధరల పెంపు మంచిదేనని భారతీయ సెల్యులార్ ఆపరేటర్ల సంఘం (సీవోఏఐ) స్వాగతించింది. దీనివల్ల ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని, టెలికం పరిశ్రమ ఆర్థికంగా బలపడి మరిన్ని ఉద్యోగాలను అందిస్తుందని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ అభిప్రాయపడ్డారు. 2016-17లో టెలికం రంగ స్థూల ఆదాయం రూ.2.65 లక్షల కోట్లుగా ఉంటే, 2018-19లో రూ.2.45 లక్షల కోట్లకు పడిపోయిందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కాగా, 2016లో జియో రాకతో వాయిస్ కాల్స్ ఉచితమైపోయిన విషయం తెలిసిందే. డేటా ధరలు 95 శాతం తగ్గిపోయాయి.

పోస్ట్-పెయిడ్ ప్లాన్ల చార్జీలపైనా..

ప్రీ-పెయిడ్ మొబైల్ చార్జీలను పెంచిన టెలికం సంస్థలు.. త్వరలో పోస్ట్-పెయిడ్ ప్లాన్ల ధరలనూ పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. మార్కెట్‌లో పోటీ వాతావరణం, సుప్రీం కోర్టు తీర్పు మధ్య పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ పడిపోయాయి. ఈ జూలై-సెప్టెంబర్‌లో రికార్డు స్థాయి నష్టాలు వచ్చాయి. ఆదాయం పెరిగేందుకు పోస్ట్-పెయిడ్ ప్లాన్లపైనా బాదుతాయన్న అంచనాలున్నాయి.

డేటా చార్జీలు తక్కువే: ప్రసాద్

టెలికం సంస్థలు మొబైల్ చార్జీలను పెంచుతున్న నేపథ్యంలో ఇప్పటికీ ప్రపంచంలో మొబైల్ ఇంటర్నెట్ ధర తక్కువగా ఉన్నది భారత్‌లోనేనని టెలికం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. భారత్‌లో ఒక గిగాబైట్ మొబైల్ ఇంటర్నెట్ ధర 0.26 డాలర్లుగా ఉందని, బ్రిటన్‌లో 6.66 డాలర్లు, అమెరికాలో 12.37 డాలర్లుగా ఉందని తెలిపారు. ప్రపంచ సగటు ధర 8.53 డాలర్లుగా ఉందని గుర్తుచేశారు. యూపీఏ హయాంలో ఒక జీబీ డేటా ధర రూ.268.97గా ఉందన్న ఆయన ఇప్పుడు రూ.11.78గా ఉందని ట్రాయ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయన్నారు.

1013
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles