డౌన్‌లోడ్‌లో ఎయిర్‌టెల్ స్పీడ్

Wed,October 23, 2019 05:05 AM

- అప్‌లోడింగ్‌లో ఐడియాదే హవా.. ఓపెన్‌సిగ్నల్ వెల్లడి

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: దేశంలోని 4జీ నెట్‌వర్క్‌ల్లో భారతీ ఎయిర్‌టెల్ అత్యుత్తమమని బ్రిటన్‌కు చెందిన మొబైల్ సేవల విశ్లేషణ సంస్థ ఓపెన్‌సిగ్నల్ ప్రకటించింది. డేటా స్పీడ్, వీడియో అనుభవాల్లో ఎయిర్‌టెల్ టాప్‌లో నిలిచినట్లు స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా అన్ని సర్కిళ్లలో 9.6 ఎంబీపీఎస్ (మెగాబైట్స్ పర్ సెకండ్) డౌన్‌లోడ్ స్పీడ్‌ను ఆగస్టు నెలాఖరుతో ముగిసిన మూడు నెలల్లో ఎయిర్‌టెల్ వినియోగదారులు అందుకుంటున్నట్లు తెలిపింది. ఓపెన్‌సిగ్నల్ లెక్క ప్రకారం 7.9 ఎంబీపీఎస్‌తో వొడాఫోన్ రెండో స్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో ఐడియా (7.6 ఎంబీపీఎస్), జియో (6.7 ఎంబీపీఎస్), బీఎస్‌ఎన్‌ఎల్ (3.1 ఎంబీపీఎస్) ఉన్నాయి. ఇక అప్‌లోడింగ్‌లో 3.2 ఎంబీపీఎస్‌తో ఐడియా ముందున్నది. వొడాఫోన్ 3.1 ఎంబీపీఎస్‌తో రెండో స్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో ఎయిర్‌టెల్ (2.4 ఎంబీపీఎస్), జియో (2.1 ఎంబీపీఎస్), బీఎస్‌ఎన్‌ఎల్ (0.9 ఎంబీపీఎస్) ఉన్నాయి.

అందరికి చేరువలో జియోనే

ఇదిలావుంటే దేశంలో 4జీ సేవల అందుబాటు విషయంలో మాత్రం జియో అగ్రస్థానంలో నిలిచింది. భారతీయ 4జీ వినియోగదారుల్లో 97.8 శాతం మందికి జియో సేవలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది. 89.2 శాతం మందికి అందుబాటులో ఉండి ఎయిర్‌టెల్ రెండో స్థానానికి పరిమితమైంది. వొడాఫోన్ 77.4 శాతం, ఐడియా 76.9 శాతంతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌కు దేశవ్యాప్తంగా 3జీ నెట్‌వర్కే ఉన్న విషయం తెలిసిందే. 4జీ సేవలు పరిమితంగానే ఉన్నాయి. దేశంలోని 42 నగరా ల్లో 76.77 లక్షల మొబైల్స్‌ను పరిశీలించి ఈ నివేదికను ఓపెన్‌సిగ్నల్ రూపొందించింది.

రూ.4,500 కోట్లు చెల్లింపు

గడిచిన మూడు, నాలుగు రోజుల్లో ప్రైవేట్ రంగ టెలికం సంస్థలు.. టెలికం శాఖకు రూ.4,500 కోట్లకుపైగా స్పెక్ట్రం బకాయిలను చెల్లించాయి. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో రూ.1,133 కోట్లు, సునీల్ భారతీ మిట్టల్‌కు చెందిన ఎయిర్‌టెల్ రూ.977 కోట్లు చెల్లించగా, వొడాఫోన్ ఐడియా మాత్రం రూ.2,421 కోట్లను తీర్చింది. మొత్తం ఈ మూడు సంస్థలు కలిపి రూ.4,531 కోట్లను చెల్లించాయి.

908
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles