ఎయిర్‌టెల్ చేతికి టాటా టెలీ

Fri,October 13, 2017 01:15 AM

Airtel to acquire Tata Teleservices in a debt free cash free deal

-అరుదైన డీల్‌తో ఒక్కటవుతున్న వైనం..
-రుణ రహిత - నగదు రహిత ప్రాతిపదికన ఒప్పందం
-1నుంచి ఉద్యోగులు, స్పెక్ట్రం బదలాయింపు..
-4 కోట్లకుపైగా పెరుగనున్న ఎయిర్‌టెల్ కస్టమర్లు
airtel_tata
న్యూఢిల్లీ, అక్టోబర్ 12: భారతీ ఎయిర్‌టెల్‌లో టాటా టెలీ సర్వీసెస్ విలీనమైపోతున్నది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి, నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న మొబైల్ టెలిఫోన్ వ్యాపారం నుంచి ఎలాగైనా బయటపడాలనుకున్న టాటా గ్రూప్.. దాన్ని ఎట్టకేలకు వదిలించుకుంది. రుణ భారం ఏమాత్రం తగ్గకపోయినా, చేతికి కొత్తగా నిధులేమీ రాకపోయినా.. కేవలం తమ స్పెక్ట్రమ్ నిల్వలకు ఊతమిచ్చేలా రుణ - నగదు రహిత ఒప్పందాన్ని టాటా గ్రూప్ గురువారం కుదుర్చుకుంది. డెట్-ఫ్రీ, క్యాష్-ఫ్రీ ప్రాతిపదికపై దేశవ్యాప్తంగా 19 టెలికం సర్కిళ్లు లేదా జోన్లలోగల టాటా టెలీ సర్వీసెస్ లిమిటెడ్ (టీటీఎస్‌ఎల్), టాటా టెలీ సర్వీసెస్ మహారాష్ట్ర లిమిటెడ్ (టీటీఎమ్‌ఎల్)లకు చెందిన 4 కోట్లకుపైగా కస్టమర్లు నవంబర్ 1 నుంచి ఎయిర్‌టెల్ కస్టమర్లలో కలిసిపోనున్నారు. అలాగే ఈ 19 సర్కిళ్లలోని టీటీఎస్‌ఎల్, టీటీఎమ్‌ఎల్ ఉద్యోగులు, కన్స్యూమర్ మొబైల్ బిజినెస్ (సీఎంబీ) నిర్వహణ, 800, 1800, 2100 మెగాహెర్జ్ (3జీ, 4జీ) శ్రేణిలోని మొత్తం 178.5 మెగాహెర్జ్ స్పెక్ట్రం కూడా ఎయిర్‌టెల్‌కు బదిలీ కానున్నాయి.

ఇకపోతే ఈ డీల్ అనంతరం కూడా టాటా టెలీ సర్వీసెస్‌కున్న రూ. 31,000 కోట్ల రుణ భారం బాధ్యత టాటా గ్రూప్‌దే. అయితే ప్రభుత్వానికి వాయిదాలపై చెల్లించాల్సిన రూ. 9,000-10,000 కోట్ల స్పెక్ట్రం బకాయిల్లో ఎయిర్‌టెల్ దాదాపు 20 శాతం ఇవ్వనుంది. అంటే రూ. 1,800 కోట్ల నుంచి రూ. 2,000 కోట్లు మాత్రమే. మిగతా మొత్తాన్ని కూడా టాటా గ్రూపే చెల్లించనుంది. ఇక ఈ ఒప్పందాన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో టాటా గ్రూప్, దాని వాటాదారుల కోసం చేసుకున్న అత్యుత్తమ, అత్యంత సుహృద్భావ పరిష్కారంగా అభివర్ణించారు టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్. భారతీయ మొబైల్ పరిశ్రమలో తదుపరి ఏకీకరణ, స్థిరీకరణకు ఇది గొప్ప నిర్ణయమని, దీనివల్ల పెరిగే టెక్నాలజీ, పోర్ట్‌ఫోలియోతో చౌక, ప్రపంచ శ్రేణి సేవలను అందిస్తామన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్. కాగా, మున్ముందు టాటా, భారతీ ఎయిర్‌టెల్ పరస్పర సహకారంతో ముందుకెళ్ళగలవన్న ఆశాభావాన్ని ఇరు సంస్థలు ఈ సందర్భంగా విడుదల చేసిన ఓ ప్రకటన ద్వారా వ్యక్తం చేయడం గమనార్హం.

మరోవైపు కన్స్యూమర్ మొబైల్ బిజినెస్‌ను మొత్తానికే మూసేయడానికి బదులుగా మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. దీనివల్ల టెలికం వ్యాపారంలో టాటాలకున్న ప్రయోజనాలు ఎప్పటికైనా సజీవంగా ఉంటాయని ఆశిస్తున్నాం అని టాటా గ్రూప్ సీఎఫ్‌వో సౌరభ్ అగ్రవాల్ అన్నారు. టాటా టెలీకి ఉన్న 5 వేల మందికిపైగా ఉద్యోగుల భవిష్యత్తు దృష్ట్యా ఈ డీల్‌కు వచ్చామన్నారు. టవర్ కంపెనీ వియోమ్‌లో వాటా యథాతథంగా ఉంటుందని, టాటా కమ్యూనికేషన్స్‌కు దీన్ని బదలాయించే ప్రయత్నం చేస్తున్నామని, అలాగే టాటా స్కైలోకి రిటైల్ ఫిక్స్‌డ్-లైన్, బ్రాడ్‌బ్యాండ్ కార్యకలాపాలను మార్చేందుకు చూస్తున్నామని చెప్పారు. ఇదిలావుంటే టాటా టెలీ ఎంటర్‌ప్రైజ్ వ్యాపారాన్ని కొనేందుకున్న అవకాశాలను అన్వేషిస్తున్నట్లు టాటా కమ్యూనికేషన్స్ గురువారం స్టాక్ మార్కెట్లకు తెలిపింది. దీనికి సంబంధించి ముందుకెళ్తున్నట్లు పేర్కొంది.

కాగా, నిరుడు సెప్టెంబర్ నుంచి టెలికం రంగం ఏకీకరణ వైపు అడుగులేస్తోంది. జియో రాక నేపథ్యంలో ఇప్పటికే వొడాఫోన్ - ఐడియా సెల్యులార్ ఒక్కటైపోతుండగా, దీనివల్ల దేశంలోనే అతిపెద్ద టెలికం సంస్థగా ఆవిర్భవించనుంది. దీని విలువ దాదాపు రూ. 1,51,153 కోట్లకు పైమాటే. కస్టమర్ల సంఖ్య 40 కోట్లకు చేరుతుంది. దీంతో ఎయిర్‌టెల్ స్థానం రెండుకు పడిపోనుంది. అయితే టాటా టెలీ డీల్‌తో ఎయిర్‌టెల్ కస్టమర్ల సంఖ్య 32 కోట్లకుపైకి చేరుకోనున్నది. జియో వినియోగదారులు కేవలం ఏడాదిలో 12.8 కోట్లకు చేరిన నేపథ్యంలో మార్కెట్ లీడర్‌షిప్‌ను ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోకూడదనుకుంటున్న ఎయిర్‌టెల్.. వీలైనన్ని సంస్థలను తమలో ఐక్యం చేసుకుని కస్టమర్లను పెంచుకోవాలని చూస్తున్నది. గడిచిన ఐదేండ్లలో టాటా టెలీ సహా మొత్తం ఏడు డీల్స్‌ను ఎయిర్‌టెల్ ఇప్పటిదాకా చేసుకోవడం గమనార్హం. ఈ ఫిబ్రవరిలో ఆంధ్రపద్రేశ్ తదితర ఏడు సర్కిళ్లలోగల టెలీనార్ కార్యకలాపాలను ఎయిర్‌టెల్ తమ గుప్పిట్లోకి తీసుకుంది.

ఇదీ డీల్..

టాటా టెలీ డీల్‌తో ఎయిర్‌టెల్ కస్టమర్ల సంఖ్య 32 కోట్లు

4,00,00,000

డెట్-ఫ్రీ, క్యాష్-ఫ్రీ ప్రాతిపదికపై దేశవ్యాప్తంగా 19 టెలికం సర్కిళ్లు లేదా జోన్లలోగల టాటా టెలీసర్వీసెస్ లిమిటెడ్, టాటా టెలీసర్వీసెస్ మహారాష్ట్ర లిమిటెడ్‌లకు చెందిన 4 కోట్లకుపైగా కస్టమర్లు నవంబర్ 1 నుంచి ఎయిర్‌టెల్ కస్టమర్లలో కలిసిపోనున్నారు.

19 సర్కిళ్లలోని టీటీఎస్‌ఎల్, టీటీఎమ్‌ఎల్ ఉద్యోగులు, కన్స్యూమర్ మొబైల్ బిజినెస్ నిర్వహణ, 800, 1800, 2100 మెగాహెర్జ్ (3జీ, 4జీ) శ్రేణిలోని మొత్తం 178.5 మెగాహెర్జ్ స్పెక్ట్రం అన్నికూడా ఎయిర్‌టెల్‌కు బదిలీ కానున్నాయి.

31,000 కోట్లు

టాటా టెలీసర్వీసెస్‌కున్న రూ. 31,000 కోట్ల రుణ భారం బాధ్యత టాటా గ్రూప్‌దే. కాగా ప్రభుత్వానికి వాయిదాలపై చెల్లించాల్సిన 9,000-10,000 కోట్ల స్పెక్ట్రమ్ బకాయిల్లో ఎయిర్‌టెల్ దాదాపు 20 శాతం ఇవ్వనుంది. మిగతా మొత్తాన్ని కూడా టాటా గ్రూపే చెల్లించనుంది.

2498

More News

VIRAL NEWS

Featured Articles