రూ.1,399కే ఎయిర్‌టెల్4జీ స్మార్ట్‌ఫోన్

Thu,October 12, 2017 12:01 AM

Airtel offers 4G smartphone at 'effective price' of Rs 1,399

Airtel-4G
న్యూఢిల్లీ, అక్టోబర్ 11: ముకేశ్ అంబానీకి చెందిన జియోకు పోటీగా టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ చౌక ధర కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కార్బన్ మొబైల్స్‌తో కలిసి రూపొందించిన ఈ స్మార్ట్‌ఫోన్ ధరను రూ. 1,399గా నిర్ణయించినట్లు ఎయిర్‌టెల్ బుధవారం ప్రకటించింది. రూ.1,500కే ఇంటర్నెట్ కలిగిన 4జీ ఫీచర్ ఫోన్‌ను జియో మార్కెట్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనికి పోటీగా ఎయిర్‌టెల్ ఏకంగా ఇంతకంటే తక్కువ ధరకే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను అందించడం విశేషం. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారు డౌన్ పేమెంట్ కింద రూ.2,899 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చెల్లించిన దాంట్లో మూడేండ్ల తర్వాత ఎయిర్‌టెల్ రూ.1,500 మొత్తాన్ని కొనుగోలుదారుడికి అందచేయనున్నది. అంటే స్మార్ట్‌ఫోన్ ధర అక్షరాల రూ.1,399కే లభించనున్నదన్న మాట. ఈ క్యాష్‌బ్యాక్ పొందాలంటే ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసినవారు తొలి మూడేండ్లలో ప్రతి నెల రూ.169 చొప్పున రీచార్జి చేయించుకోవాల్సి ఉంటుంది. 18 నెలల తర్వాత తొలి విడుతగా రూ.500 క్యాష్‌బ్యాక్ లభించనుండగా, ఆ తర్వాతి 18 నెలలకూ మరో రూ.1,000 పొందవచ్చునని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. మూడేండ్ల తర్వాత ఈ ఫోన్‌ను వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేదని సంస్థ స్పష్టంచేసింది.

ఆండ్రాయిడ్ ఆధారంగా నడిచే ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ సిమ్, యూట్యూబ్, వాట్సప్, ఫేస్‌బుక్ వంటి సామాజిక సైట్లు యాక్సెస్ కలిగివుండనున్నది. 8జీబీ మెమొరీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. నెలకు రూ.169 రీచార్జిపై అపరిమిత కాల్స్‌తోపాటు రోజుకు 500 ఎంబీ డాటా లభించనున్నది. సామాన్యుడికి సైతం చౌక ధర కలిగిన స్మార్ట్‌ఫోన్ అందించాలనే ఉద్దేశంతో ఈ మొబైల్‌ను విడుదల చేసినట్లు భారతీ ఎయిర్‌టెల్ డైరెక్టర్ రాజ్ తెలిపారు. ఆన్‌లైన్‌తోపాటు రిటైల్ అవుట్‌లెట్లలోనూ ఈ ఫోన్లను అందుబాటులో ఉంచనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఎయిర్‌టెల్‌కు 28 కోట్ల మంది టెలికం వినియోగదారులు ఉన్నారు.

661

More News

VIRAL NEWS