సోషల్ మీడియాకెక్కిన ఎయిర్ ఇండియా ఉద్యోగులు

Mon,April 16, 2018 12:58 AM

Air India staff unions hit social media against disinvestment plan

-సంస్థను ప్రైవేటీకరించాలన్న నిర్ణయంపై నిరసన
SM
ముంబై, ఏప్రిల్ 15: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సర్కారు తీసుకున్న నిర్ణయం వలన తాము ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుందని ఆ సంస్థలోని 10 వేల మందికి పైగా ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఆ ఉద్యోగులకు ప్రాతినిథ్యం వహిస్తున్న దాదాపు 11 యూనియన్లు ఇప్పుడు ట్విట్టర్, యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఎయిర్ ఇండియాను రక్షించండి (సేవ్ ఎయిర్ ఇండియా) అనే నినాదంతో కూడిన పలు మెసేజ్‌లు, గ్రాఫిక్స్‌ను ఆ సంఘాలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నాయి. దేశానికే ఎంతో గర్వకారణమైన ఈ జాతీయ విమానయాన సంస్థలో పెట్టుబడులను ఉపసంహరించాలన్న ప్రభుత్వ నిర్ణయం పట్ల ప్రతి ఒక్కరూ నిరసన వ్యక్తం చేయాలని వాట్సాప్ సందేశాల ద్వారా ప్రజలకు సైతం విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆ సంఘాల ప్రతినిధులు తెలిపారు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు అందులోని వాటాను అమ్మడం మినహా మరో మార్గం లేదని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ఇటీవల సమగ్రమైన ప్రాథమిక సమాచార పత్రాన్ని (ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ మెమోరాండంను) జారీచేసిన విషయం విదితమే.

ఎయిర్ ఇండియాలో 76 శాతం వాటాను అమ్మి దానిపై ఆ సంస్థ యాజమాన్య బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు బదిలీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఆ మెమోరాండంలో స్పష్టం చేసింది. దీనిపై ప్రభుత్వం, ఎయిర్ ఇండియా యాజమాన్యం, వివిధ ఉద్యోగ సంఘాల మధ్య పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ ఆ సంస్థతో పాటు అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల భవిష్యత్తు పట్ల తీవ్రస్థాయిలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఐఎఫ్‌సీ ఆసక్తి

అమ్మకం ప్రక్రియలో పాల్గొనేందుకు ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్‌సీ) ఆసక్తి చూపుతున్నది. ప్రపంచ బ్యాంకుకు చెందిన ప్రైవేటు పెట్టుబడుల విభాగమైన ఐఎఫ్‌సీ.. ఎయిర్ ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలను పరిశీలించడమే కాకుండా, ఈ బిడ్డింగ్‌లో విజేతగా నిలిచే సంస్థ అప్పును పూర్తిగా మాఫీ చేసేందుకు సుముఖంగా ఉన్నదని, దీనిపై ఐఎఫ్‌సీ ఈ లావాదేవీకి సలహాదారు (ట్రాన్సాక్షన్ అడ్వైజర్)గా వ్యవహరిస్తున్న ఎర్నెస్ట్ యంగ్‌తో ఇప్పటికే పలుసార్లు చర్చలు జరిపిందని ఈ పరిణామం గురించి తెలిసిన ఒక వ్యక్తి వెల్లడించారు. దీనిపై ఐఎఫ్‌సీ అధికార ప్రతినిధిని సంప్రదించగా, ఎయిర్ ఇండియా అమ్మకం ప్రక్రియను గమస్తున్నామని, ఈ అమ్మకం పూర్తయిన తర్వాత అందులో తాము కూడా భాగస్వామిగా ఉండేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నామని స్పష్టం చేశారు.

మళ్లీ ఏ320 నియో విమానాల సేవలు!

భద్రతాపరమైన ఆందోళనల మధ్య గత రెండు నెలల్లో విమానయాన సేవలకు దూరమైన ఏ320 నియో విమానాలు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. ప్రాట్ అండ్ విట్నీ ఇంజిన్ ఆధారిత ఎయిర్‌బస్ ఏ320 నియో విమానాలు ప్రయాణీకుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తుండటంతో డీజీసీఏ వీటిని పక్కనబెట్టాలని ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో ఇండిగో, గోఎయిర్‌లకు చెందిన 14 సర్వీసులు ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిలిచిపోయాయి. తరచూ సాంకేతిక సమస్యలు ఏర్పడుతుండటంతో ప్రయాణీకుల ప్రాణాలు గాల్లో దీపంలా తయారయ్యాయి. అయితే ఇవి తిరిగి సేవల్లోకి వచ్చాయని ఇరు సంస్థల అధికారులు తాజాగా తెలిపారు. ఈ విమానాల్లో ఇండిగోకు చెందినవి 11 ఉండగా, గోఎయిర్‌కు చెందినవి మూడున్నాయి.

468
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS