ఎస్‌బీఐ తరహాలో మరో 4 దిగ్గజ బ్యాంకుల ఏర్పాటు!


Mon,June 19, 2017 02:59 AM

చిన్న బ్యాంకుల టేకోవర్‌పై దృష్టిపెట్టండి..
పీఎన్‌బీ, బీవోబీ, కెనరా బ్యాంక్, బోవోఐని కోరిన ఆర్థిక శాఖ!

banksignmi
న్యూఢిల్లీ, జూన్ 18: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తరహాలో మరో నాలుగు ప్రపంచస్థాయి బ్యాంకింగ్ దిగ్గజాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. చిన్న, మధ్య స్థాయి బ్యాంకుల టేకోవర్‌కు అవకాశాలను అన్వేషించాలని నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులను(పీఎస్‌బీ) కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. బడా పీఎస్‌బీల జాబితాలో ఎస్‌బీఐ తర్వాత స్థానాల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ), కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) ఉన్నాయి. కాబట్టి ఈ బ్యాంకులు మున్ముందు రోజుల్లో చిన్న బ్యాంకుల టేకోవర్‌కు ప్రయత్నించవచ్చు. చిన్న బ్యాంకులను విలీనం చేసుకునేముందు పాంతీయ సమతుల్యత, భౌగోళిక విస్తరణ, ఆర్థిక భారం, మానవ వనరుల సమ్మిళితం వంటి అంశాలను నిశితంగా అధ్యయనం చేసి నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే, ఆర్థికంగా బలహీనంగా ఉన్న బ్యాంక్‌ను పటిష్ఠమైన బ్యాంక్‌లో విలీనం చేయడం తెలివైన నిర్ణయం కాదని, తద్వారా విలీనానికి ముందు ఆర్థిక పరిపుష్ఠి కలిగిన బ్యాంక్ కూడా బలహీనపడే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. అయితే, బ్యాంకింగ్‌లో రెండో దఫా విలీనాలపై నీతి ఆయోగ్ రిపోర్టు సమర్పించాకే ఈ విషయంపై స్పష్టత రానుంది.

ఈ ఏడాది ఏప్రిల్ 1న ఎస్‌బీఐ.. తన ఐదు అనుబంధ బ్యాంకులతోపాటు భారతీయ మహిళా బ్యాంకును తనలో విలీనం చేసుకుంది. తద్వారా ప్రపంచంలోని 50 అతిపెద్ద బ్యాంకుల జాబితాలోకెక్కింది. ఎస్‌బీఐలో విలీనమైన అనుబంధ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్), స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆప్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్ ఉన్నాయి. మెర్జర్ ఫలితంగా ఎస్‌బీఐ కస్టమర్ల సంఖ్య 37 కోట్లకు చేరుకుంది. శాఖల సంఖ్య 24 వేలు, ఏటీఎంలు 59వేలకు చేరుకున్నాయి. ఎస్‌బీఐ విలీన ప్రక్రియ విజయవంతంగా పూర్తికావడంతో ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా మరో ప్రతిపాదనకు అనుమతులివ్వాలని కేంద్రం భావిస్తున్నది. అయితే బ్యాంకింగ్ రంగంలో ఆందోళనకర స్థాయికి చేరుకున్న మొండిబకాయిల సమస్య కాస్త తగ్గుముఖం పట్టాక మరో విలీనాన్ని చేపట్టే అవకాశం ఉంది.

470

More News

VIRAL NEWS