అన్నీ ఆన్‌లైన్‌లోనే..

Tue,October 8, 2019 02:13 AM

-వేగంగా విస్తరిస్తున్న ఈ-కామర్స్ మార్కెట్
-పడిపోతున్న సంప్రదాయ వ్యాపారం
-గ్రామాల్లోనూ బలపడుతున్న ఈ-మార్కెటీర్లు
-పండుగ సీజన్‌లో ఆఫర్లతో ఆన్‌లైన్ షాపింగ్ కళకళ
-పోటీ ప్రకటనలతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న దుకాణదారులు

న్యూఢిల్లీ/హైదరాబాద్, అక్టోబర్ 7: అర క్షణంలో అన్నీ అరచేతిలోకి రావాలనుకునే నేటి తరానికి.. ఆన్‌లైనే అంతా అన్నట్లు తయారైంది. సంప్రదాయ మార్కెట్ ముఖమైనా చూసేందుకు ఇష్టపడని యువత.. అన్నీ ఆన్‌లైన్‌లోనే కానిచ్చేస్తున్నది మరి. దీనికితోడు ఆఫర్లు ఉండనే ఉన్నాయి. ఫలితంగా ఈ-కామర్స్ మార్కెట్.. రాకెట్ వేగంతో దూసుకుపోతున్నది. ఆర్థిక మందగమనంలోనూ నూతన అంచనాలతో పరుగులు పెడుతున్నది. నిరుడు పండుగ సీజన్‌లో ఆన్‌లైన్ అమ్మకాలు 2.9 బిలియన్ డాలర్లుగా ఉంటే, ఈసారి 3.8 బిలియన్ డాలర్లుగా నమోదు కావచ్చని పరిశ్రమ వర్గాల అభిప్రాయం. ఇందులో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లదే పైచేయి. ప్రస్తుత దేశీయ ఆన్‌లైన్ మార్కెట్‌లో 75 శాతం వాటా ఈ రెండింటిదే.

పండుగ సీజనే కీలకం

ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు ఇప్పటికే పండుగ సీజన్ సమరాన్ని ఆరంభించేశాయి. కస్టమర్లను ఆకట్టుకునేందుకు బోలెడు ఆఫర్లతో ముందుకొచ్చేశాయి. డిమాండ్ దృష్ట్యా హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో వేలాది తాత్కాలిక ఉద్యోగులనూ ఈ సంస్థలు నియమించేసుకుంటున్న విషయం తెలిసిందే. అక్టోబర్-నవంబర్ నెలలపై భారతీయ వ్యాపారులు పెద్ద ఎత్తునే ఆశలు పెట్టుకుంటారు. పెద్ద పండుగల కాలం కావడంతో వార్షిక అమ్మకాల్లో సగమైనా ఈ పండుగల్లో నమోదు చేసుకోవాలని ఆరాటపడుతుంటారు. అయితే విస్తరిస్తున్న ఆన్‌లైన్ మార్కెట్.. వీరి ఆశల్ని ఆవిరి చేస్తున్నది. నగదు కొరత, నిరుద్యోగం వంటివి సంప్రదాయ మార్కెట్‌ను మరింతగా కుంగదీస్తున్నాయని ఢిల్లీ హోల్‌సేల్ మార్కెట్ వ్యాపారుల సంఘం సదర్ బజార్ ట్రేడర్స్ అసోసియేషన్ ప్రతినిధి రాకేశ్ కుమార్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆఫర్లు, ప్రకటనలే అండ

ఆర్థిక మాంద్యంలోనూ ఆన్‌లైన్ మార్కెట్ జోరుగా సాగుతున్నది. ఇందుకు కారణం అవి ఇస్తున్న ఆఫర్లు, చేస్తున్న ప్రచారమే. క్యాష్‌బ్యాక్, భారీ డిస్కౌంట్లు, క్రెడిట్ సదుపాయం, ఈఎంఐ వెసులుబాటు వంటివి కస్టమర్లను కొనుగోళ్ల వైపునకు లాగేస్తున్నాయి. మెగా సేల్స్, బిగ్ డీల్స్ అంటూ పత్రికలు, టెలివిజన్లలో ప్రకటనలు, రహదారులపై హోర్డింగ్‌లతోపాటు మెట్రో రైళ్లు, సిటీ బస్సులు, క్యాబ్స్ తదితర రవాణా వ్యవస్థలపై పోస్టర్లు కూడా ఆన్‌లైన్ షాపింగ్‌ను అందరికీ దగ్గర చేస్తున్నది. బ్యాంకులు కూడా తమ క్రెడిట్ కార్డులతో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తే ఖాతాదారులకు రివార్డులిస్తుండటం మరింతగా కలిసొస్తున్నది. ఈ విషయంలో సంప్రదాయ వ్యాపారులు చాలాచాలా వెనుకబడిపోతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

దుకాణదారుల పాట్లు

ఆన్‌లైన్ సంస్థలకు ధీటుగా పోటీ ప్రకటనలతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు దుకాణదారులు. క్యాష్‌బ్యాక్, అప్‌టూ ఆఫర్లు, బైవన్ గెట్‌వన్, టుప్లస్‌వన్‌లతోపాటు నిర్ణీత మొత్తంలో షాపింగ్ చేస్తే బంగారం, ద్విచక్ర వాహనాలు, బంపర్ ప్రైజ్ కింద కార్లు, ఫ్లాట్లు, గృహాలనూ ఆఫర్ చేస్తున్నారు. చివరకు ఆన్‌లైన్ ధరలకూ ఇస్తామంటూ కొనుగోలుదారులను ఆకర్షించే దిశగా శ్రమిస్తున్నారు. దీంతో ఆ మేరకు కొంత విజయాన్ని వారు అందుకోగలుగుతున్నారు.

కిరాణా వ్యాపారంలోనూ..

స్థానికంగా ఎంతో బలమైన కిరాణా వ్యాపార వ్యవస్థనూ ఆన్‌లైన్ మార్కెట్ ప్రభావితం చేస్తున్నది. భారతీయ రిటైల్ మార్కెట్ విలువ 600 బిలియన్ డాలర్లని అంచనా. ఇందులో ఈ-కామర్స్ మార్కెటీర్ల వాటా 5 శాతం కన్నా తక్కువే. అయితే 2022 నాటికి ఇది 8-9 శాతానికి పెరుగుతుందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. ఒంటికి, ఇంటికి సంబంధించినవే కాకుండా వంటింటికీ ఆన్‌లైన్ మార్కెటీర్లు వచ్చేస్తున్నారని, కిరాణా సరుకులను తక్కువ ధరకే అందిస్తున్నాయని, తమకు గిరాకీ తక్కువైపోతున్నదని ఇప్పుడు పలువురు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం ఆన్‌లైన్ మార్కెట్ నిబంధనలు కఠినతరం చేసినా.. ఆ ప్రభావం అంతంతమాత్రమేనన్న వాదనలు సంప్రదాయ మార్కెటీర్ల నుంచి వినిపిస్తున్నాయి.

smart-phone

స్మార్ట్ ఫోన్ల వల్లే..

స్మార్ట్ ఫోన్లు అందరికీ చేరువయ్యాయి. ఇంటర్నెట్ కూడా చౌకగానే లభిస్తున్నది. దీంతో ఆన్‌లైన్ షాపింగ్ సులభమైపోయింది. క్షణం తీరికలేని ఈ యాంత్రిక జీవనంలో ఇంటి నుంచే షాపింగ్ చేయాలని కోరుకునేవారే ఎక్కువైపోయారు. దీంతో రోడ్డు మీదున్న దుకాణాలకు వచ్చేవారే కరువైపోయారు. ఒకప్పుడు నెల రోజుల ముందే మార్కెట్‌కు పండుగ వచ్చేది. కానీ ఇప్పుడు రెండు రోజులకు పరిమితమైంది. అదికూడా ఆన్‌లైన్ షాపింగ్ తర్వాత ప్రత్యామ్నాయమైపోయిందంటే అతిశయోక్తి కాదు. మొబైల్ ఆర్డర్లపై ఇంటి వద్దకే డెలివరీలు వచ్చేస్తున్నాయి. ఇక నగరాలు, పట్టణాల్లో ట్రాఫిక్ కష్టాలు కూడా ఆన్‌లైన్ షాపింగ్‌కు దోహదం చేస్తున్నాయి.

snap-deal

స్నాప్‌డీల్ దూకుడు

ప్రముఖ ఆన్‌లైన్ మార్కెటింగ్ సంస్థ స్నాప్‌డీల్.. మూడు ప్రత్యేక ఈ-స్టోర్లను ప్రారంభించనున్నది. కర్వా చౌత్, ధనత్రయోదశి, దీపావళి పండుగల సందర్భంగా వీటిని అందుబాటులోకి తేనున్నది. నానాటికీ పెరుగుతున్న ఆన్‌లైన్ షాపింగ్ క్రేజ్‌ను ఒడిసి పట్టేందుకు ఈ-స్టోర్లను ఉపయోగించుకోవాలని స్నాప్‌డీల్ భావిస్తున్నది. కాగా, ఒక్కో ఈ-స్టోర్‌లో ఆయా పండుగలకు సంబంధించిన ఉత్పత్తులన్నింటినీ కస్టమర్లు పొందవచ్చని స్నాప్‌డీల్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. కర్వా చౌత్ ఈ-స్టోర్‌లో అన్ని రకాల పూజా సామాగ్రి, ధనత్రయోదశి ఈ-స్టోర్‌లో బంగారు, వెండి నాణేలు, దీపావళి ఈ-స్టోర్‌లో ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, లక్ష్మీ, గణేశ్ ప్రతిమలు ఉంటాయని చెప్పారు.

amazon-flipkart

పోటెత్తిన అమ్మకాలు

ఈ పండుగ సీజన్‌లో ఆన్‌లైన్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. దేశీయ ఈ-కామర్స్ మార్కెట్‌లో దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి బంపర్ సేల్స్‌ను నమోదు చేశామని చెబుతున్నాయి. ఇటీవలి తమ బిగ్ బిలియన్ డేస్‌కు అపూర్వ స్పందన లభించిందని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించగా, మా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌కు విశేష ఆదరణ దక్కిందని అమెజాన్ స్పష్టం చేసింది. గతంతో పోల్చితే ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఆకర్షణీయ అమ్మకాలను చూశామని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచీ ఆర్డర్లు వస్తున్నాయని పేర్కొన్నారు. కొత్త కస్టమర్లు 50 నుంచి 60 శాతం పెరిగారన్న ఆయన మొత్తం ఈ పండుగ అమ్మకాల్లో 70 నుంచి 75 శాతం మావేనన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

మరోవైపు ఈసారి స్మార్ట్‌ఫోన్, ఫ్యాషన్ ఉత్పత్తుల విక్రయాలు బాగా జరిగాయని, గతేడాదితో చూస్తే స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు ఏకంగా 15 రెట్లు, ఫ్యాషన్ దుస్తుల అమ్మకాలు 5 రెట్లు పుంజుకున్నాయని అమెజాన్ ఇండియా అధిపతి, సీనియర్ ఉపాధ్యక్షుడు అమిత్ అగర్వాల్ చెప్పారు. ఈ నెల 13 నుంచి 17 వరకు రెండో విడుత గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ను అమెజాన్ నిర్వహించనున్నది. మరోవైపు తమ ఫస్ట్ దీవాలీ సేల్‌కు గొప్ప ఆదరణ కనిపించిందని స్నాప్‌డీల్ సైతం ప్రకటించింది. గత నెల 29 నుంచి ఈ నెల 6దాకా ఈ సేల్ జరుగగా, అమ్మకాల్లో గతంతో పోల్చితే ఈసారి 52 శాతం వృద్ధి నమోదైందని తెలిపింది.

1665
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles