జోరుగా నకిలీ దందా

Wed,June 13, 2018 12:32 AM

80 percent of consumers believe they use genuine ones

-నాసిరకం ఉత్పత్తులతో నిండిపోతున్న మార్కెట్
-80 శాతం మంది తెలియకనే కొంటున్నారు
-వెల్లడించిన ఫిక్కీ కాస్కేడ్
fake-followers
న్యూఢిల్లీ, జూన్ 12: దేశీయ మార్కెట్‌లో ప్రస్తుతం నకిలీ దందా జోరుగా సాగుతున్నదని వ్యాపార, పారిశ్రామిక సంఘం ఫిక్కీ ఆందోళన వ్యక్తం చేసింది. రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 20 శాతం నకిలీ ఆటో ఉత్పత్తుల వల్లే జరుగుతున్నాయన్న ఫిక్కీ.. ఎఫ్‌ఎంసీజీ రంగ అమ్మకాల్లో 30 శాతం నాసిరకానికి చెందినవేనన్నది. కొనుగోలుదారుల్లో 80 శాతం మందికి ఇదంతా తెలియదని, తాము కొంటున్నది అసలుసిసలైన నాణ్యమైన ఉత్పత్తులేనని భ్రమపడుతూ మోసపోతున్నారని చెప్పింది. నకిలీ ఉత్పత్తులు దేశీయ వినియోగదారులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని, ఇప్పుడు కేవలం కస్టమర్లలో అవగాహన తెస్తే సరిపోదని, విధానకర్తలు, చట్టాలు రూపొందిస్తున్న ప్రజాప్రతినిధులను, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలనూ అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉన్నదని ఫిక్కీ కాస్కేడ్ (ఆర్థిక వ్యవస్థకు ముప్పు తెస్తున్న స్మగ్లింగ్, నకిలీ కార్యకలాపాల వ్యతిరేక కమిటీ) అభిప్రాయపడింది. నకిలీ, అక్రమ వాణిజ్యం వల్ల ప్రభుత్వ ఆదాయానికీ గండి పడుతున్నదని, ఖజానాకూ భారీ నష్టం వాటిల్లుతున్నదని పేర్కొంది.

ఆ రంగం.. ఈ రంగం అనే తేడా లేకుండా అన్ని రంగాల్లోనూ నాణ్యత లోపిస్తున్నదని, ఆటో, ఫార్మా, డైరీ, ఆహార, ఎఫ్‌ఎంసీజీ ఇలా ఎక్కడ చూసినా నకిలీ ఉత్పత్తులే ఎక్కువగా కనిపిస్తున్నాయన్నది. ఈ క్రమంలోనే 20 శాతం రోడ్డు ప్రమాదాలకు ఆటో రంగంలో తయారవుతున్న నకిలీ ఉత్పత్తులే కారణమన్నది. స్మగ్లింగ్, నకిలీ వంటి అక్రమ వ్యాపార కార్యకలాపాలు పరిశ్రమలను, ప్రభుత్వాలను, ఆర్థిక వ్యవస్థలను, వినియోగదారుల ఆరోగ్యానికి, భద్రతలకు ప్రమాదం తెస్తున్నాయి అని పేర్కొన్నది. కాగా, కేవలం ఏడు ఉత్పాదక రంగాల్లో అక్రమ వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల వల్ల కేంద్ర ప్రభుత్వానికి వాటిల్లుతున్న మొత్తం నష్టం రూ.39,239 కోట్లని ఫిక్కీ కాస్కేడ్ అంచనా వేసింది. నకిలీ, అక్రమ పొగాకు వ్యాపారం వల్ల రూ.9,139 కోట్లు, అడ్డదారుల్లో దేశీయ మార్కెట్‌లోకి వెల్లువెత్తుతున్న మొబైల్ ఫోన్లతో రూ.6,705 కోట్లు, స్మగ్లింగ్ మద్యం వల్ల రూ.6,309 కోట్ల చొప్పున ఖజానాకు ఆదాయం దూరమవుతున్నదని ఫిక్కీ కాస్కేడ్ వివరించింది.

960

More News

VIRAL NEWS