HomeBusiness News

రూ.31 వేల కోట్ల ఎన్‌పీఏల వసూళ్లు

Published: Sat,February 9, 2019 12:13 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   

-పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: మొండి బకాయిలను తగ్గించుకోవడానికి ప్రభుత్వరంగ బ్యాంకులు చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో(ఏప్రిల్-డిసెంబర్ మధ్యకాలం) పీఎస్‌బీల నిరర్థక ఆస్తులు రూ.31 వేల కోట్లు తగ్గి రూ.8, 64,433 కోట్లుగా ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్ ప్రతాప్ శుక్లా లోక్‌సభకు లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. గత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ఇవి రూ.8, 95,601 కోట్లుగా ఉన్నాయి. ఇదే క్రమంలో జూన్ 2018 నాటికి రూ.8,75,619 కోట్లకు తగ్గిన ఎన్‌పీఏలు..డిసెంబర్ 31 నాటికి రూ.8,64,433 కోట్లకు తగ్గినట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేట్ పరం చేసే ఉద్దేశమేది కేంద్ర ప్రభుత్వానికి లేదని మరోప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.

బ్యాంకుల మొండి బకాయిల భరతం పట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 4ఆర్‌లు(గుర్తింపు, తీర్మానం, రీక్యాపిటలైజేషన్, సంస్కరణలు) వ్యూహాత్మక ప్రక్రియ మంచి ఫలితాలను ఇచ్చిందని, అలాగే రిజర్వు బ్యాంక్ కూడా చొరవ తీసుకోవడం ఇందుకు దోహదపడిందన్నారు. ఎన్‌పీఏలతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న పీఎస్‌బీలకు ఆర్థికంగా ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశంతో భారీ స్థాయిలో నిధులను కేటాయించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. మార్చి 31, 2014 నాటికి రూ.2,27,264 కోట్లుగా ఉన్న బ్యాంకుల నిరర్థక ఆస్తుల విలువ మార్చి 31, 2017 నాటికి రూ.6,84,732 కోట్లకు చేరుకున్నాయని రిజర్వు బ్యాంక్ వద్ద ఉన్న సమాచారం మేరకు వెల్లడైంది. వీటిని తగ్గించడానికి కేంద్రంతీసుకున్న కఠిన చర్యలతో గడిచిన నాలుగేండ్లకాలంలో రూ.3,33,491 కోట్ల రుణాలను రికవరీ చేయగలిగామని మంత్రి చెప్పారు.

రూ.7.89 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు


ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి మధ్యకాలంలో రూ.7.89 లక్షల కోట్ల నికర ప్రత్యక్ష పన్నులు వసూలైనట్లు ప్రతాప్ శుక్లా తెలిపారు. 2018-19 అసెస్‌మెంట్ సంవత్సరానికిగాను 9.92 కోట్ల మంది ప్రత్యక్ష పన్ను చెల్లింపు దారుల నుంచి ఈ పన్నులను వసూలు చేసినట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 2017-18లో 7.41 కోట్ల మంది రూ.10.02 లక్షల కోట్ల మేర చెల్లింపులు జరిపినట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.12 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూలు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. కాగా, గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.100 కోట్ల కంటే అధికం ఆదా యం కలిగిన 61 మంది స్వచ్ఛందంగా తమ ఆస్తులను వెల్లడించినట్లు పార్లమెంట్‌కు కేంద్ర ప్రభుత్వం తెలియచేసింది. అంతక్రితం ఏడాది ఇది 38 మందిగా ఉన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలతో స్వచ్ఛందంగా ఆదాయాన్ని వెల్లడించేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నారని మంత్రి చెప్పారు. 2014-15 అసెస్‌మెంట్ సంవత్సరానికిగాను 24 మంది ఐటీ రిటర్నులు దాఖలు చేశారు. బినామీ ఆస్తుల లావాదేవీల చట్టం ప్రకారం రూ.6,900 కోట్ల విలువైన ఆస్తులను ఇప్పటి వరకు జప్తు చేసినట్లు మరో ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.

551

Recent News