సైయెంట్ లాభం 104 కోట్లు


Fri,April 21, 2017 12:34 AM

క్యూ4లో 37 శాతం వృద్ధి
హైదరాబాద్, ఏప్రిల్ 20: రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఐటీ సేవల సంస్థ సైయెంట్ ఆశాజనక ఫలితాలను ప్రకటించింది. మార్చి 31తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో రూ.104.6 కోట్ల లాభాన్ని నమోదు చేసుకున్నది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.76.4 కోట్ల లాభంతో పోలిస్తే 36.9 శాతం వృద్ధి కనబరిచినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
cyient
జనవరి-మార్చి మధ్యకాలంలో సంస్థ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 15 శాతం ఎగబాకి రూ.941 కోట్లుగా నమోదైంది. 2015-16 ఆర్థిక సంవత్సరం ఇదేకాలానికి రూ.819.5 కోట్లు ఆర్జించింది. నాలుగో త్రైమాసిక ఫలితాలు అంచనావేసిన స్థాయిలోనే నమోదయ్యాయని, ఒక త్రైమాసికంలో ఇంతటి స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించడం ఇదే తొలిసారని సైయెంట్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో కృష్ణ బొడనపు తెలిపారు. ప్రస్తుతం సంస్థ వద్ద నగదు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ఒక ప్రకటనలో వెల్లడించారు. గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.3,606.5 కోట్ల ఆదాయం(16.3 శాతం వృద్ధి)పై రూ.369.9 కోట్ల నికర లాభాన్ని(10.7 శాతం వృద్ధి) ఆర్జించింది. సమీక్షకాలంలో సర్వీసెస్ బిజినెస్, యుటిలిటీ, ఏరోస్పెస్, రక్షణ, రవాణా విభాగాల్లో మెరుగైన పనితీరు కనబరిచిందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధిని నమోదు చేసుకునే అవకాశం ఉందని అవుట్‌లుక్‌లో ఆయన పేర్కొన్నారు.

251
Tags

More News

VIRAL NEWS