కెయిర్న్‌పై 30,700 కోట్ల జరిమానా


Fri,April 21, 2017 12:13 AM

Cairn
-పన్ను చెల్లించనందుకు షోకాజ్ నోటీసు జారీ చేసిన ఐటీ శాఖ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: బ్రిటన్‌కు చెందిన ఇంధన రంగ దిగ్గజం కెయిర్న్ ఎనర్జీ పీఎల్‌సీకి మన ఆదాయ పన్ను శాఖ తాజాగా మరో నోటీసును జారీ చేసింది. గతంలో జారీ చేసిన నోటీసుకు అనుగుణంగా రూ.10,247 కోట్ల పన్ను చెల్లించనందుకుగాను రూ.30,700 కోట్ల జరిమానా చెల్లించాలని తాజా నోటీసులో డిమాండ్ చేసింది. 2007లో భారత విభాగ ఆస్తుల బదలాయింపు కేసుకు సంబంధించి ఐటీ శాఖ గత ఏడాది జనవరిలో కెయిర్న్‌పై రూ.10,247 కోట్ల పన్నుతో పాటు పదేండ్ల కాలానికి రూ.18,800 కోట్ల భారీ పెనాల్టీ విధించింది. రెట్రోస్పెక్టివ్ (నిబంధన అమలు చేసే తేదీ కంటే ముందు జరిగిన లావాదేవీలకు వర్తింపజేయడం) విధానంలో జారీ చేసిన నోటీసును సవాలు చేస్తూ కెయిర్న్ ఐటీ అపిల్లెట్ ట్రిబ్యునల్‌ను (ఐటీఏటీ) ఆశ్రయించింది.

పన్ను విధింపు నిర్ణయాన్ని సమర్థించిన ట్రిబ్యునల్.. పెనాల్టీని మాత్రం మినహాయించాలని కోరింది. అందుకు అనుగుణంగా ఐటీ శాఖ గతవారం సంస్థకు రూ.10,247 కోట్ల పన్ను నోటీసును జారీ చేసింది. నిర్దేశిత గడువులోగా పన్ను చెల్లించడంలో, రిటర్నులు దాఖలు చేయడంలో విఫలమైనందుకు గాను పెనాల్టీ ఎందుకు విధించకూడదో తెలుపాలని తాజా షోకాజ్ నోటీసులో ఐటీ శాఖ పేర్కొంది. పెనాల్టీ నోటీసుపై స్పందించేందుకు కెయిర్న్ మరో 10 రోజుల గడువు కోరినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

176
Tags

More News

VIRAL NEWS