3వేలు దాటిన రెరా దరఖాస్తులు

Wed,January 9, 2019 11:54 PM

3000 Applications coress The Telangana RERA

- జరిమానా లేకుండా 2,850 దాఖలు
- 150 మంది నుంచి ఫైన్ వసూలు
- తెలంగాణ రెరా మెంబర్ సెక్రెటరీ కొమ్ము విద్యాధర్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: నిర్మాణ రంగ సంస్థల్లో పారదర్శకత నెలకొల్పడమే కాకుండా కొనుగోలుదారుల్ని పరిరక్షించడానికి ప్రారంభమైన రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) సత్ఫలితాల్ని ఇస్తున్నది. గతేడాది సెప్టెంబరు 1 నుంచి ఈ నెల 9 వరకు రెరా వద్ద దాదాపు మూడు వేల దరఖాస్తులు నమోదయ్యాయి. ఇందులో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు దాదాపు 1,600. మరో 1,400 మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు నమోదు చేసుకున్నారు. రాష్ట్రంలో రెరా నిరుడు సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి రాగా.. ఉచితంగా దరఖాస్తు చేసుకోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ మూడు నెలల గడువునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో నవంబరు 30లోపు దాదాపు 2,850 దరఖాస్తులు నమోదయ్యాయి. ఆ తర్వాత అపరాధ రుసుము చెల్లించి దాదాపు 150 మంది ప్రమోటర్లు ప్రాజెక్టులను రిజిస్టర్ చేసుకున్నారు. ఇంకా 1,500దాకా ప్రాజెక్టులు నమోదు కావాల్సి ఉన్నదని రెరా మెంబర్ సెక్రెటరీ కొమ్ము విద్యాధర్ తెలిపారు.

ఐదు రోజులే గడువు..

2017 జనవరి 1 తర్వాత తెలంగాణలో ప్రారంభమైన అపార్టుమెంట్లు, లేఅవుట్లు, ఇండిపెండెంట్ ఇండ్ల ప్రాజెక్టులు ప్రస్తుతం రెరాలో నమోదు చేసుకోవాలంటే.. రూ. 2 లక్షల జరిమానా చెల్లించాలి. ఈ అవకాశం ఈ నెల 15 వరకే ఉంటుంది. ఆ తర్వాతి భవితవ్యం, జరిమానా పెంపు ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉండనున్నాయి. కాగా, రెరా నుంచి అనుమతి తీసుకోకుండా పత్రికల్లో ఎలాంటి ప్రకటనల్ని విడుదల చేయకూడదని కొమ్ము విద్యాధర్ రియల్టర్లను హెచ్చరించారు. అలా చేసినవారి నుంచి నిబంధనల ప్రకారం భారీ జరిమానా వసూలు చేస్తామన్నారు. తమ అనుమతి లేకుండా పత్రికల్లో ప్రకటనల్ని ఇచ్చిన పలు సంస్థలకు షోకాజ్ నోటీసులను జారీ చేశామని ఆయన తెలిపారు. నిర్మాణ రంగంలో పారదర్శకతను పెంపొందించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరడానికి తెలంగాణ నిర్మాణ సంస్థలన్నీ కలిసికట్టుగా ముందుకు రావాలని కోరారు. ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు చెందిన రియల్టర్లు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను నమోదు చేసుకోవాలని సూచించారు.

మార్చి 2 నుంచి భారీ ప్రాపర్టీ షో

రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రాపర్టీ షోను మార్చి 2 నుంచి 4దాకా మూడు రోజులపాటు హైటెక్స్‌లో నిర్వహిస్తున్నామని క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎస్ రాంరెడ్డి తెలిపారు. ఇందులో సుమారు 120 మంది డెవలపర్లు తమ ప్రాజెక్టులను ప్రదర్శిస్తున్నారని వెల్లడించారు. బుధవారం ఆయన క్రెడాయ్ హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు అవసరమయ్యే ఇండ్ల వివరాలు క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోలో లభిస్తాయన్నారు. హైదరాబాద్‌లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇంతకుమించిన సరైన సమయం లేదన్నారు. దేశంలోనే హైదరాబాద్ అత్యంత ఆదరణ గల నగరంగా ఖ్యాతిని ఆర్జిస్తున్నదన్న ఆయన మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత, పారదర్శకమైన నిర్ణయాలు, సంస్కరణలే ఇందుకు ప్రధాన కారణమన్నారు. త్రాగునీరు, సాగునీరు, నిరంతర విద్యుత్ వంటివి తెలంగాణను దేశంలోనే అగ్రభాగంలో నిలబెడుతున్నాయని కొనియాడారు. ప్రధాన కార్యదర్శి మన్‌భూమ్ రామకృష్ణారావు మాట్లాడుతూ.. ఈసారి మూడు రోజుల పాటు జరిగే ప్రాపర్టీషోలో కనీసం యాభై వేల మంది సందర్శకులు విచ్చేస్తారని అంచనా వేశారు. అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లా ప్రాజెక్టులు, హరిత భవనాలు, సమీకృత పట్టణాలతోపాటు వాణిజ్య సముదాయాల వివరాలను సందర్శకులు ఈ ప్రదర్శన ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు.

1979
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles